చెరుకు, వరి పరిశోధనా విధానంపై రైతులకు అవగాహన

చెరుకు, వరి పరిశోధనా విధానంపై రైతులకు అవగాహన

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 30 నుండి మే 23 వరకు జరిగే ఈ ప్రచారంలో భాగంగా గురువారం నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం జాగీర్యాల్ గ్రామంలో రుద్రూరు చెరుకు, వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు కలిసి రైతులకు వివిధ వ్యవసాయాంశాలపై విస్తృత అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా రుద్రూరు పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. వ్యవసాయం లాభసాటిగా మారాలంటే కేవలం అధిక దిగుబడి మాత్రమే కాకుండా, మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న పంట రకాలను ఎంపిక చేసుకోవడం ఎంతో ముఖ్యమని వివరించారు. రైతులు నాణ్యమైన, విశ్వవిద్యాలయం లేదా వ్యవసాయ శాఖ సిఫార్సు చేసిన వరి రకాలనే సాగు చేయాలన్నారు. స్థానిక, జాతీయ మార్కెట్లలో కొనుగోలుదారులు ఎక్కువగా మొగ్గు చూపే రకాలను ఎంచుకోవడం ద్వారా మెరుగైన ధర పొంది ఆదాయాన్ని పెంచుకోవచ్చని సూచించారు.

అనంతరం సేంద్రియ వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ.. రసాయన ఎరువులు, కీటకనాశకాలు వాడకుండా సహజ వనరులు, ప్రకృతి ఆధారిత పద్ధతులతో సాగు చేయడం వల్ల నేల ఆరోగ్యం, పర్యావరణం సంరక్షించబడుతుందన్నారు. సేంద్రియ ఎరువులు, జీవ ఎరువుల వినియోగం, సహజ కీటక నియంత్రణ, పంట మార్పిడి, మిశ్రమ పంటలు మరియు మల్చింగ్ వంటి పద్ధతుల ద్వారా సుస్థిరమైన, లాభదాయకమైన దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. రైతులు క్రమంగా రసాయనాల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ పద్ధతుల వైపు మళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.

మండల వ్యవసాయ అధికారిణి బి. లావణ్య మాట్లాడుతూ.. రాబోయే వానకాలం సీజన్‌లో రైతులు ప్రభుత్వం సూచించిన వరి వంగడాలనే సాగు చేయాలని కోరారు. ముఖ్యంగా సన్న రకాలైన బిపిటి-5204, ఆర్ఎన్ఆర్-15048, కేఎన్ఎం-1638, జైశ్రీరామ్, హెచ్ఎంటి, డబ్ల్యూజీఎల్-962, డబ్ల్యూజీఎల్-44, జేజీఎల్-1798 రకాలను మరియు దొడ్డు రకాలైన ఐఆర్-64, ఎంటియు-1010, కేఎన్ఎం-118 రకాలను మాత్రమే సాగు చేయాలని రైతులకు వివరించారు.

Leave a Reply