ఓటర్ల సవరణ ప్రక్రియలో బీఎల్ఏలు కీలక పాత్ర పోషించాలి

ఓటర్ల సవరణ ప్రక్రియలో బీఎల్ఏలు కీలక పాత్ర పోషించాలి

  • వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్

ఆంధ్రప్రభ, విజయవాడ:
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) కీలకంగా వ్యవహరించాలని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ సూచించారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గ బీఎల్ఏలకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా బీఎల్ఏలకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై సమగ్రంగా అవగాహన కల్పిస్తూ, పార్టీ శ్రేణులు ప్రతి బూత్ స్థాయిలో అప్రమత్తంగా పనిచేయాలని దేవినేని అవినాష్ సూచించారు. ఓటర్ల వివరాల పరిశీలన, జాబితాల సవరణ, అర్హులైన ప్రతి ఓటరును నమోదు చేయడం వంటి అంశాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో బూత్ స్థాయి నాయకుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ కందుల రవీంద్ర రెడ్డి పాల్గొని, బూత్ లెవెల్ ఏజెంట్లకు ఓటర్ల సవరణ ప్రక్రియ మీద అవగాహన కల్పించారు. బూత్ స్థాయి వ్యవస్థ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ అలీమ్, జిల్లా టీచర్స్ విభాగం అధ్యక్షుడు ఆంజనేయ రెడ్డి, మండల అధ్యక్షులు యళ్లబోయిన ప్రభు, తుళ్లూరు ఉదయ్ మరియు మాజీ కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు, పార్టీ నాయకులు, బీఎల్ఏలు పాల్గొన్నారు.

Leave a Reply