మద్దిమడుగు అగ్నిప్రమాద బాధితులకు పరామర్శ..

అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట నియోజకవర్గంలోని పదర మండలం మద్దిమడుగు గ్రామంలో బుధవారం అర్ధరాత్రి సంభవించిన అగ్నిప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రాత్రి 3 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో పలు దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గురువారం ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అగ్నికి ఆహుతైన దుకాణాలను పరిశీలించిన ఎమ్మెల్యే, బాధిత కుటుంబాలతో మాట్లాడి వారి ఆవేదనను తెలుసుకున్నారు.

ప్రమాదంతో జీవనోపాధి కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నష్టాన్ని అంచనా వేసి తక్షణ సహాయం, తగిన పరిహారం అందించేలా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రమాద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. అనంతరం తన వంతుగా బాధితులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

