పర్యాటక ప్రాంతంలో ‘అంధకారం’

పర్యాటక ప్రాంతంలో ‘అంధకారం’
- నాగార్జునసాగర్ సరిహద్దులో మెరుగైన భద్రత అవసరం
గుంటూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ:
దేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన నాగార్జున సాగర్ డ్యామ్ ప్రాంతంలో రాత్రి వేళల్లో నెలకొంటున్న అంధకారం పర్యాటకుల్లో ఆందోళన కలిగిస్తోంది. తెలుగు రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న సాగర్ ప్రాంతానికి ప్రతి సంవత్సరం వేలాది మంది దేశీయ, విదేశీ పర్యాటకులు వస్తుండగా, రాత్రివేళ సరైన స్ట్రీట్‌లైటింగ్ లేకపోవడం భద్రతాపరమైన సందేహాలకు దారితీస్తోంది.
పర్యాటక ప్రాధాన్యత పెరుగుతున్న సాగర్
పర్యాటకం, బౌద్ధ వారసత్వం, ప్రకృతి అందాలతో నాగార్జునకొండ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. సాగర్ గేట్లు ఎత్తిన సమయంలో ప్రాజెక్టు అందాలను చూసేందుకు భారీ సంఖ్యలో సందర్శకులు తరలివస్తుంటారు. ఆచార్య నాగార్జున కాలానికి చెందిన చారిత్రక అవశేషాలను తిలకించేందుకు విదేశీయులు కూడా తరచూ సందర్శిస్తుంటారు.
చీకటి వేళల్లో పెరుగుతున్న అసౌకర్యం
2005లో అందుబాటులోకి వచ్చిన సాగర్ కొత్త వంతెన ద్వారా ఆంధ్రప్రదేశ్–తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలు కొనసాగుతున్నాయి. అయితే సరిహద్దు ప్రాంతంలో, ముఖ్యంగా వంతెన పరిసరాల్లో రాత్రివేళ తగినంత విద్యుత్ వెలుగులు లేకపోవడం పర్యాటకులకు ఇబ్బందిగా మారుతోంది. రెండు రాష్ట్రాల చెక్‌పోస్టుల వద్ద మాత్రమే కొద్దిపాటి వెలుతురు కనిపిస్తుండగా, మిగతా ప్రాంతం ఎక్కువగా చీకటిలోనే మగ్గుతోంది.

జాతీయ రహదారి అయినా వెలుగుల కొరత
నేషనల్ హైవే 565 మార్గం ద్వారా ఈ ప్రాంతానికి మరింత ప్రాధాన్యత పెరిగింది. రహదారి అభివృద్ధితో పాటు స్ట్రీట్‌లైటింగ్, సీసీ కెమెరాలు, భద్రతా ఏర్పాట్లు మెరుగుపడతాయని పర్యాటకులు ఆశించినప్పటికీ, ఇంకా పూర్తి స్థాయిలో సౌకర్యాలు అందుబాటులోకి రాలేదని స్థానికులు చెబుతున్నారు.
ఎత్తిపోతల – బుద్ధ పౌర్ణిమ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి
ఏపీ వైపు ఉన్న ఎత్తిపోతల ఫాల్స్ , శ్రీ దత్తాత్రేయ స్వామి టెంపుల్ ప్రాంతాలకు కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు వెళ్తుంటారు. తెలంగాణ వైపు బుద్ధ పౌర్ణిమ ప్రాజెక్టు సందర్శకులతో కిటకిటలాడుతుంది. అయితే ఇరు వైపులా రాత్రి వేళల్లో సరైన స్ట్రీట్‌లైటింగ్ లేకపోవడం వల్ల సందర్శకులు అసౌకర్యానికి గురవుతున్నట్లు తెలుస్తోంది.
వెలుగులతో భద్రత – పర్యాటకాభివృద్ధికి ఊతం
నాగార్జునసాగర్ వంటి అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన పర్యాటక ప్రాంతంలో స్ట్రీట్‌లైటింగ్, నిఘా వ్యవస్థ, భద్రతా చర్యలు మరింత బలోపేతం చేస్తే పర్యాటకులకు విశ్వాసం పెరుగుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకుంటే సాగర్ పర్యాటక ఆకర్షణ మరింత పెరిగే అవకాశం ఉంది.

