పుష్కర పనుల్లో అధికారుల నిర్లక్ష్యం బహిర్గతం

పుష్కర పనుల్లో అధికారుల నిర్లక్ష్యం బహిర్గతం
- సాధారణ ఘాట్ వద్ద కుప్పకూలిన టెంట్..
- జాతీయ రహదారిపై ప్రమాదకరంగా స్వాగత తోరణం
- సరస్వతి ఘాట్ వద్ద కూలిన స్వాగత ద్వారం రోడ్డుపై పడిపోవడంతో కలకలం
- పట్టపగలే వెలుగుతున్న లైట్లు.. ప్రజాధనం వృథా!
మహాదేవపూర్, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ నది అంత్య పుష్కరాల ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. కోట్ల రూపాయలతో చేపట్టిన పనుల్లో నాణ్యత లోపం, పర్యవేక్షణ లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన నిర్మాణాలే ఇప్పుడు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

సాధారణ ఘాట్ వద్ద భక్తుల కోసం ఏర్పాటు చేసిన భారీ టెంట్ అకస్మాత్తుగా కుప్పకూలింది. అదృష్టవశాత్తూ ఘటన జరిగిన సమయంలో టెంట్ కింద భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనతో అక్కడికి వచ్చిన భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. టెంట్ ఏర్పాటు పనుల్లో నాణ్యత పాటించకపోవడం, సరైన బిగింపులు లేకపోవడమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇక జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన స్వాగత తోరణం కూడా ప్రమాదకరంగా మారింది. నామమాత్రంగా ఏర్పాటు చేసిన తోరణం స్వల్ప గాలికే అటూ ఇటూ ఊగిపోతోంది. ఎప్పుడైనా కూలిపోయే పరిస్థితిలో ఉండటంతో వాహనదారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వాహన రాకపోకలు జరిగే ప్రాంతంలో ఇలాంటి నిర్లక్ష్య ఏర్పాట్లు చేయడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ప్రజలు మండిపడుతున్నారు.

అలాగే సరస్వతి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన స్వాగత తోరణం ఒక్కసారిగా కుప్పకూలి రోడ్డుపై పడిపోవడం కలకలం రేపింది. ఘటన సమయంలో రహదారిపై భారీ రద్దీ లేకపోవడంతో ప్రమాదం తప్పినప్పటికీ, భక్తులు మరియు స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నాసిరకం నిర్మాణ పనులు, సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే ఈ ఘటనకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. పుష్కరాల కోసం ఏర్పాటు చేస్తున్న నిర్మాణాల నాణ్యతపై ఈ ఘటనతో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు సరస్వతీ ఘాట్ నుంచి సాధారణ ఘాట్ వరకు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు పట్టపగలే వెలుగుతుండటం విమర్శలకు తావిస్తోంది. విద్యుత్ వినియోగంపై ఎలాంటి పర్యవేక్షణ లేకుండా ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రివేళ భక్తులకు ఉపయోగపడాల్సిన లైట్లు పగటిపూట కూడా వెలుగుతుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పుష్కరాల పేరుతో హడావుడిగా పనులు పూర్తి చేశామని చూపించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారే తప్ప, భక్తుల భద్రతపై మాత్రం చిత్తశుద్ధి కనిపించడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పనుల నాణ్యతపై సమగ్ర విచారణ జరిపి, నిర్లక్ష్యానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
