ఎండల మధ్య భక్తులకు చల్లని ఉపశమనం

ఎండల మధ్య భక్తులకు చల్లని ఉపశమనం
మహాదేవపూర్, ఆంధ్రప్రభ : సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం త్రివేణి సంగమానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో జిల్లా పరిపాలన విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, పుష్కర స్నానాలకు వెళ్లే మార్గాల్లో భక్తులకు ఉపశమనం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు అమలు చేస్తున్నారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు పుష్కర ఘాట్లు, ప్రధాన రహదారులు, క్యూలైన్ల వద్ద మిస్ట్ ఫాగ్ స్ప్రింకర్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా నీటి జల్లులు కురిసేలా చేసి భక్తులకు చల్లదనం కల్పిస్తున్నారు. ఈ ఏర్పాట్లు ఎండ ప్రభావాన్ని తగ్గిస్తూ భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందిస్తున్నాయి. అదేవిధంగా తాగునీటి సదుపాయం, తాత్కాలిక షెడ్లు, వైద్య శిబిరాలు, అంబులెన్స్ సేవలు తదితర ప్రాథమిక వసతులను జిల్లా యంత్రాంగం విస్తృతంగా ఏర్పాటు చేసింది. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుష్కర స్నానాలు ఆచరించేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. భక్తులు జిల్లా యంత్రాంగం సూచనలు, సలహాలు పాటిస్తూ సహకరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విజ్ఞప్తి చేశారు.
