మాదకద్రవ్యాల రహిత జిల్లాగా ఏలూరును నిర్మిద్దాం

మాదకద్రవ్యాల రహిత జిల్లాగా ఏలూరును నిర్మిద్దాం
-కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్
ఏలూరు బ్యూరో, ఆంధ్ర ప్రభ:
మాదకద్రవ్యాల మహమ్మారిని జిల్లా నుండి పారద్రోలేందుకు అధికార యంత్రాంగం మరియు సమాజం సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టరు కె. వెట్రిసెల్వి , ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశంలో వారు కీలక ఆదేశాలు జారీ చేశారు.
గంజాయి, డ్రగ్స్ రవాణా లేదా వినియోగం చేస్తూ పట్టుబడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. అటువంటి వారిపై శాశ్వత క్రిమినల్ రికార్డు నమోదవుతుందని, దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగాలకు, పాస్‌పోర్ట్ జారీకి వారు అనర్హులవుతారని కలెక్టర్, జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.
గంజాయి వినియోగంపై తరచుగా మారుమూల ప్రాంతాలలో డ్రోన్ ద్వారా నిఘా ఉంచి, రాపిడ్ టెస్ట్ ద్వారా అనుమానితులను పరీక్షించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. ప్రతి పాఠశాల, కళాశాలలో పోస్టర్లు మరియు సదస్సుల ద్వారా మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై యువతకు అవగాహన కల్పించాలని కోరారు. ఔషధ దుకాణాల్లో నార్కోటిక్ డ్రగ్స్ విక్రయాలపై నిరంతరం తనిఖీలు చేపట్టాలని, పిల్లల ప్రవర్తన, వారి స్నేహాల పట్ల తల్లిదండ్రులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. చిన్న వయసులోనే సిగరెట్లు, మత్తు పదార్థాలకు బానిస కాకుండా పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలన్నారు.
డ్రగ్స్ లేదా పెడ్లర్ల సమాచారం తెలిస్తే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 లేదా నేషనల్ హెల్ప్ లైన్ 14446 కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. రైళ్లు మరియు రవాణా వాహనాల ద్వారా జరుగుతున్న గంజాయి స్మగ్లింగ్‌ను అరికట్టడానికి ఆపరేషన్ విజయ్ మరియు వజ్ర ప్రహార్ ద్వారా గట్టి నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


