రాబోయే 4 రోజులు తీవ్రమైన వడగాలులు

రాబోయే 4 రోజులు తీవ్రమైన వడగాలులు
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఇన్‌ఛార్జ్ కలెక్టర్ సంజన సింహ
నరసరావు పేట, ఆంధ్రప్రభ : రాబోయే నాలుగు రోజుల పాటు పల్నాడు జిల్లాలో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉన్నందున, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ సంజన సింహ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆమె జిల్లా స్థాయి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని వైద్య శాఖను స్పష్టం చేశారు. ఉపాధి హామీ కూలీలకు పని వేళల్లో మార్పులు చేసి, నీడ మరియు చల్లని త్రాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఎండల తీవ్రత వల్ల అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, అగ్నిమాపక వాహనాలు మరియు సిబ్బందిని ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచాలని, అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించాలని ఆదేశించారు.
గ్రామస్థాయిలో మరియు పట్టణాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని సూచించారు.
ఎండల వల్ల మూగజీవాలకు ఇబ్బంది కలగకుండా, వాటికి తగిన నీటి సౌకర్యం మరియు షెడ్ల వద్ద తగిన ఏర్పాట్లు ఉండేలా చూడాలని ఆదేశించారు. వడగాల్పుల తీవ్రతపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించేలా ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేయాలన్నారు. ప్రజలు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.
