వరిధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు వేగవంతం చేయాలి

వరిధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు వేగవంతం చేయాలి
- కలెక్టర్‌కు బీజేవైఎం వినతి
నిర్మల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ: నిర్మల్ జిల్లాలోని వరిధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న తీవ్ర జాప్యాన్ని నివారించాలని, యుద్ధప్రాతిపదికన కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో వినతిపత్రం సమర్పించారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఒడిసేలా అర్జున్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాను కలిసి సమస్యలను వివరించారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేష్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, జిల్లా బీజేపీ అధ్యక్షులు రితేష్ రాథోడ్ ఆదేశాల మేరకు పలు డిమాండ్లతో కూడిన ఈ వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఒడిసేలా అర్జున్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన లోపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. గన్నీ బ్యాగుల కొరత తీవ్రంగా ఉందని, హమాలీలు, లారీలు సకాలంలో అందుబాటులో లేకపోవడంతో కొనుగోలు ప్రక్రియ పూర్తిగా పడకేసిందని మండిపడ్డారు. తరుగు, తేమ పేరుతో దళారులు ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నారని, కష్టపడి పండించిన రైతు చెమటను తేమ నెపంతో తక్కువ చేసి చూపే ఈ దోపిడిని తక్షణమే అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కొనుగోళ్లు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండటంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ నిరంతరం రైతుల పక్షాన ఉండి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
ఈ వినతిపత్రంపై నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సానుకూలంగా స్పందించారు. జిల్లాలో కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, ఈ నెల 30 లోగా వరిధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మేడిశెమ్మే రాజు, మహిళా నాయకురాలు అలివేలు మంగ, బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ బుర్ర రమేష్ పాల్గొన్నారు. వీరితో పాటు నిర్మల్ పట్టణ అధ్యక్షులు సుంకరి సాయి, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుమ్మరి వెంకటేష్, పోలాస భరత్, మున్సిపల్ కౌన్సిలర్లు రామోజీ నరేష్, కునా శశాంక్, గంజీ రాజు, బీజేవైఎం జిల్లా నాయకులు కందుల హరీష్, అయిండ్ల సాత్విక్, టీకాజీ, ఎం. శ్రీనివాస్, నేరల్లా సాయి, పట్టణ ప్రధాన కార్యదర్శి సోప్పరి గంగాధర్ తదితరులు హాజరయ్యారు.
