పనికి వెళ్లి ఇంటికి వచ్చేసరికి.. తాళాలు పగలగొట్టి..

పనికి వెళ్లి ఇంటికి వచ్చేసరికి.. తాళాలు పగలగొట్టి..

భూపాలపల్లి, ఆంధ్రప్రభ:
భూపాలపల్లి పట్టణంలో జరిగిన ఒక పెద్ద దొంగతనం కేసును పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు. అతని వద్ద నుండి చోరీకి గురైన రూ.1,60,000 విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నట్లు భూపాలపల్లి పట్టణ సీఐ డి. నరేష్ కుమార్ వెల్లడించారు.

పోలీసుల కథనం ప్రకారం.. భూపాలపల్లి పట్టణంలోని మహబూబ్‌పల్లి ప్రాంతానికి చెందిన మర్రి ఓదెలు మే 11న ఉదయం పనికి వెళ్లాడు. మధ్యాహ్నం తిరిగి ఇంటికి వచ్చేసరికి తన ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటం చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న ఒక తులం బంగారు గొలుసు, 30 తులాల వెండి పట్టీలు, 15 తులాల వెండి కాళ్ల గొలుసులు, 50,000 రూపాయల నగదు అపహరించినట్లు గుర్తించాడు. బాధితుడు వెంటనే భూపాలపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

క్లూస్ టీమ్ సహాయంతో క్షేత్రస్థాయిలో అన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు నిందితుడిని కొంపెల్లి లచ్చిరాం తండాకు చెందిన బైరవేని లక్ష్మణ్ కుమార్‌గా గుర్తించారు. మంగళవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. అతని వద్ద నుండి దొంగిలించిన మొత్తం సొత్తును స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

వేసవిలో ఇళ్ల భద్రతపై జాగ్రత్తలు అవసరం: సీఐ నరేష్ కుమార్
ఈ సందర్భంగా సీఐ నరేష్ కుమార్ మాట్లాడుతూ.. వేసవి సెలవుల కాలంలో కుటుంబ సభ్యులతో కలిసి ఊర్లకు, తీర్థయాత్రలకు వెళ్లేవారు తమ ఇళ్ల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఇళ్లను పూర్తిగా ఖాళీగా వదిలి వెళ్లేటప్పుడు స్థానిక పోలీసులకు ముందస్తు సమాచారం అందించాలన్నారు. పొరుగువారికి చెప్పి వెళ్లడం, నిఘా కోసం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విలువైన బంగారు ఆభరణాలు, నగదును ఇళ్లలో ఉంచకుండా బ్యాంకు లాకర్లలో సురక్షితంగా భద్రపరచుకోవాలని కోరారు. కాలనీల్లో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తూ కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు.

పనికి వెళ్లి ఇంటికి వచ్చేసరికి.. తాళాలు పగలగొట్టి..

Leave a Reply