దళిత ద్రోహానికి వైసీపీనే చిరునామా…

దళిత ద్రోహానికి వైసీపీనే చిరునామా…

సుబ్రహ్మణ్యం హత్య ఘటనను పోనీ ప్రజలు..
జగన్ పాలనలో దళితులపై పెరిగిన దాడులు
ఎన్టీఆర్ జిల్లా టిడిపి అధ్యక్షురాలు గద్దె అనురాధ..
టీడీపీ కార్యాలయంలో సంస్మరణ సభ, నివాళులు

ఆంధ్రప్రభ, విజయవాడ : వైసీపీ పాలనలో దళితులు, మహిళలు, బలహీన వర్గాలపై జరిగిన దౌర్జన్యాలను ప్రజలు ఎప్పటికీ మరవలేరని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ విమర్శించారు. మంగళవారం విజయవాడ ఆటోనగర్‌లోని తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య ఘటనకు నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. గద్దె అనురాధ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ వైసీపీ పాలనలో దళితులపై జరిగిన దాడులు, హత్యలు, అవమానకర ఘటనలు రాష్ట్ర చరిత్రలో మచ్చగా నిలిచిపోయాయని ఆరోపించారు. వీధి సుబ్రహ్మణ్యం హత్య ఘటన రాష్ట్ర ప్రజలను తీవ్రంగా కలచివేసిందన్నారు. దళితులపై ప్రేమ నటించిన జగన్ మోహన్ రెడ్డి బాధిత కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదని విమర్శించారు. కరోనా సమయంలో మాస్క్ అడిగినందుకు దళిత వైద్యుడు డాక్టర్ సుధాకర్‌పై దాడి జరిగిందని, గత వైసీపీ పాలనలో దళితులపై దాడులు, మహిళలపై అత్యాచారాలు, యువతపై అక్రమ కేసులు, రాజకీయ కక్షసాధింపులు పెరిగాయని ఆరోపించారు.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను భారీగా దారి మళ్లించి దళితుల అభివృద్ధిని అడ్డుకున్నారని గద్దె అనురాధ ఆరోపించారు. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు హయాంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. పార్లమెంట్ స్పీకర్‌గా జీఎంసీ బాలయోగి, అసెంబ్లీ స్పీకర్‌గా ప్రతిభా భారతిని నియమించి దళితులకు గౌరవం కల్పించిన ఘనత టీడీపీదేనని పేర్కొన్నారు.

Leave a Reply