ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తాం

ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తాం

  • ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ

చిట్యాల, ఆంధ్రప్రభ:
ప్రజా ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుందని, వేసవి కాలంలో రైతులు పండించిన వరి, మొక్కజొన్న ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (జీఎస్ఆర్) అన్నారు. మంగళవారం చిట్యాల మండలంలోని శాంతినగర్ శివారులో గల లక్ష్మీనరసింహ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లును భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్‌లతో కలిసి ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా మిల్లు యజమానులు శేఖర్, వినయ్ కుమార్ లతో మాట్లాడి కొనుగోలు చేసిన వరి ధాన్యం, మిల్లింగ్ ప్రక్రియ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. ఈ సంవత్సరం జిల్లాలో వరి, మొక్కజొన్నలు ఎక్కువ మొత్తంలో దిగుబడి వచ్చాయన్నారు. దీంతో జిల్లాలోని గోదాములు నిండిపోవడంతో ధాన్యాన్ని జమ్మికుంట, సిద్దిపేట తదితర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలులో అక్రమాలకు పాల్పడి రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రైస్ మిల్లులను సీజ్ చేయడంతో పాటు పోలీసు కేసులు నమోదు చేస్తామన్నారు. జిల్లాలో ఇప్పటికే 90 శాతం మక్కల కొనుగోలు పూర్తయిందని చెప్పారు. చిట్యాల మండలం తిరుమలాపూర్ లో మక్కలు రవాణా చేసేందుకు వెంటనే లారీలు, వాహనాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అకాల వర్షాలు వస్తే రైతులు ఇబ్బందులు పడతారని, కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు.

ట్రక్ షీట్‌ల జారీలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు: కలెక్టర్ రాహుల్ శర్మ
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయి తనిఖీల్లో కాంటా పూర్తికాగానే రైతులకు తక్షణమే ట్రక్ షీట్‌లు ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైస్ మిల్లుల్లో ధాన్యం దిగుమతి ప్రక్రియ వేగవంతంగా జరిగేలా చూడాలన్నారు. రైతులు, మిల్లర్ల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.

ఈ తనిఖీ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి కిరణ్ కుమార్, డీఎం రాములు, సహకార అధికారి వాలియా నాయక్ పాల్గొన్నారు. వీరితో పాటు చిట్యాల వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి, కాంగ్రెస్ నాయకులు గూట్ల తిరుపతి, ముకిరాల మధువంశీకృష్ణ, గడ్డం కొమరయ్య, బుర్ర లక్ష్మణ్ గౌడ్, సంబంధిత శాఖల సిబ్బంది హాజరయ్యారు.

Leave a Reply