Rs.1 cr | ‘మొబైల్ రికవరీ మేళా’కు విశేష స్పందన

Rs.1 cr | ‘మొబైల్ రికవరీ మేళా’కు విశేష స్పందన
- రూ.1 కోటి విలువైన 500 మొబైల్ ఫోన్ల రికవరీ
- ఇప్పటివరకు 4,785 మొబైల్ ఫోన్లు బాధితులకు అప్పగింత
- ఇతర రాష్ట్రాల్లోనూ ట్రాకింగ్ చేసి ఫోన్ల స్వాధీనం
- సీఈఐఆర్ సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ సూచన
- ప్రతిభ కనబరిచిన సైబర్ క్రైమ్ సిబ్బందికి ప్రశంసలు
Rs.1 cr | తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : విధుల నిర్వహణలో తిరుపతి పోలీసులు మరోసారి తమ సత్తా చాటారు. దొంగిలించబడిన, పోగుట్టుకున్న మొబైల్ ఫోన్లను తిరిగి బాధితులకు అందించారు. జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన “మొబైల్ రికవరీ మేళా” కార్యక్రమంలో సుమారు రూ.1 కోటి విలువైన 500 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో జిల్లా ఎస్పీ ఎస్పీ ఈ వివరాలను వెల్లడించారు. ఇప్పటివరకు నిర్వహించిన 13 దశల్లో మొత్తం రూ.10.52 కోట్ల విలువైన 4,785 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ఫోన్ కీలక భాగంగా మారిందని ఎస్పీ పేర్కొన్నారు.

Rs.1 cr | ఇతర రాష్ట్రాల్లో నుంచి రికవరీ…
ప్రజలు ఫోన్ పోగొట్టుకున్నప్పుడు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే సీఈఐఆర్ సేవల ద్వారా ఫిర్యాదు నమోదు చేసే సౌకర్యం కల్పించినట్లు ఎస్పీ చెప్పారు. తిరుపతి జిల్లా పోలీసులు కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కూడా మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి రికవరీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ప్రత్యేక బృందాల కృషి వల్లే ఈ విజయాలు సాధ్యమవుతున్నాయని తెలిపారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారు 9490617873 వాట్సాప్ నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపితే సీఈఐఆర్ సేవలకు సంబంధించిన లింక్ అందుతుందని ఎస్పీ తెలిపారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు నమోదు, ఐఎంఈఐ నంబర్ బ్లాక్ చేయడం, తిరిగి ఫోన్ లభించిన తర్వాత అన్‌బ్లాక్ చేసుకునే సౌకర్యం కూడా ఉందన్నారు.

Rs.1 cr | ప్రజలు అప్రతమత్తంగా ఉండాలి…
ప్రజలు మొబైల్ ఫోన్ల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. మొబైల్ పోగొట్టుకున్న వెంటనే సిమ్ కార్డును బ్లాక్ చేయించుకోవడంతో పాటు సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని చెప్పారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్‌లకు బలమైన పాస్‌వర్డులు ఉపయోగించాలని, అపరిచితుల నుంచి మొబైల్ ఫోన్లు కొనుగోలు చేయరాదని హెచ్చరించారు. సైబర్ క్రైమ్ విభాగం సీఐ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం మొబైల్ ట్రాకింగ్, రికవరీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన సైబర్ క్రైమ్ సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేసి ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటరావు, సైబర్ సెల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

CLICK HERE TO READ MORE : Rs.243 cr | ప్రభుత్వ సాయంపై గంగపుత్రుల హర్షం
