రసాయన పరిశ్రమల కాలుష్యంపై కలెక్టర్ సీరియస్

రసాయన పరిశ్రమల కాలుష్యంపై కలెక్టర్ సీరియస్
- 12 మంది సభ్యులతో జిల్లాస్థాయి సంయుక్త కమిటీ ఏర్పాటు
- ఆంధ్రప్రభ వరుస కథనాలు, గ్రామస్తుల ఫిర్యాదులతో కదిలిన యంత్రాంగం
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని పలు రసాయన పరిశ్రమలు, ల్యాబొరేటరీలు, ఉత్పాదక పరిశ్రమల వల్ల జరుగుతున్న పర్యావరణ కాలుష్యం, తీవ్రమైన దుర్వాసన, ప్రజారోగ్య సమస్యలపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తీవ్రంగా స్పందించారు. ఈ సమస్యలపై సమగ్ర విచారణ జరిపి, తగిన నివారణ చర్యలను ప్రతిపాదించడానికి ఆయన ఒక ఉన్నత స్థాయి “జిల్లా స్థాయి సంయుక్త కమిటీ” ని ఏర్పాటు చేస్తూ సంచలన ఉత్తర్వులు (ప్రొసీడింగ్ నెం. సి2/టీజీపీసీబీ-841-ఐఎన్ఎఫ్/2026) జారీ చేశారు.
కాలుష్యంపై ఆంధ్రప్రభ వరుస కథనాలు, గ్రామస్తుల ఫిర్యాదులతో కదలిక

చౌటుప్పల్ డివిజన్ లోని భూదాన్ పోచంపల్లి మండలం అంతమ్మగూడెం, దోతీగూడెం గ్రామాల పరిసరాలలో ఉన్న పలు రసాయన పరిశ్రమల వల్ల తీవ్రమైన దుర్వాసన వస్తోందని, దీనివల్ల పర్యావరణం దెబ్బతినడమే కాకుండా ప్రజారోగ్యం, వ్యవసాయంపై తీవ్ర దుష్ప్రభావం పడుతోందని, పీల్చే గాలి, త్రాగే నీరు, తినే పంటలు, భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమై ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్న విషయంపై “ఆంధ్రప్రభ వరుస కథనాలతో అక్షర పోరాటం” చేయగా కాలుష్య బాధితులు, గ్రామస్తులు ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి, మే నెలల్లో కలెక్టరేట్‌లో పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు.
ముఖ్యంగా మెసర్స్ హాజెలో ల్యాబొరేటరీ, బృందావన్, కెమిక్ లైఫ్ సైన్స్, ఆప్టిమస్, వి.జె. సాయి, ఎస్.వి.ఆర్. ల్యాబొరేటరీస్, ఆర్కిమెడిస్, రావుస్ ల్యాబొరేటరీస్ తదితర పరిశ్రమల నిర్వహణపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రజారోగ్యం, పారిశ్రామిక భద్రత, చట్టబద్ధమైన అనుమతుల ఉల్లంఘన వంటి అంశాలు ఇందులో ముడిపడి ఉన్నందున సమగ్ర విచారణ అవసరమని కలెక్టర్ నిర్ధారించారు. 12 మందితో భారీ కమిటీ ఏర్పాటు: రసాయన పరిశ్రమల మీద వస్తున్న ఆరోపణలపై క్షేత్రస్థాయి పరిశీలన కోసం కలెక్టర్ 12 మంది సభ్యులతో కూడిన జిల్లాస్థాయి సంయుక్త కమిటీని ఏర్పాటు చేశారు.
ఉన్నత స్థాయి కమిటీ వివరాలు విచారణ కమిటీకి

చైర్మన్ గా భువనగిరి, చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ లు, కన్వీనర్ గా పర్యావరణ ఇంజనీర్, కాలుష్య నియంత్రణ మండలి ఉమ్మడి నల్గొండ జిల్లా రీజినల్ ఆఫీసర్, కో-కన్వీనర్ గా జిల్లాఫ్యాక్టరీల డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్, సభ్యులుగా జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్, గ్రామీణ నీటి సరఫరా ఈఈ, జిల్లా పంచాయతీ అధికారి, విద్యుత్ శాఖ ఇన్స్పెక్టరేట్ డీఈ, జిల్లా ఫైర్ ఆఫీసర్, జిల్లా వ్యవసాయ అధికారి, నీటిపారుదల శాఖ ఈఈ, జిల్లా భూగర్భ జలాల అధికారి, సంబంధిత తహశీల్దార్లను జిల్లా కలెక్టర్ నియమించారు.
ఈ సంయుక్త కమిటీ సదరు రసాయన పరిశ్రమలలో క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు చేపట్టాలి. పరిశ్రమల్లో ఉన్న కాలుష్య నియంత్రణ వ్యవస్థల పనితీరు, భద్రతా ప్రమాణాలు, ప్రమాదకర రసాయనాల నిల్వ-నిర్వహణ పద్ధతులను నిశితంగా పరిశీలించాలి. పరిశ్రమలకు ఉన్న చట్టపరమైన అనుమతులు, నిబంధనల అమలు తీరును తనిఖీ చేసి, కాలుష్యం వల్ల ప్రజారోగ్యం, వ్యవసాయం, జలవనరులపై పడిన ప్రభావాన్ని అంచనా వేయాలి. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సదరు పరిశ్రమలపై తీసుకోవాల్సిన కఠినమైన, చట్టపరమైన నియంత్రణ చర్యలను, కాలుష్య నివారణకు అవసరమైన పరిష్కారాలను సూచించాలి.
15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలి:

ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ఈ కాలుష్యం వ్యవహారాన్ని అత్యంత అత్యవసరమైనదిగా పరిగణించాలని కలెక్టర్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కమిటీ సభ్యులందరూ పరస్పరం సహకరించుకుంటూ, తనిఖీలు పూర్తి చేసి, ఉత్తర్వులు అందిన 15 రోజుల్లోగా సమగ్ర నివేదికను తనకు సమర్పించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. ఈ ఉత్తర్వుల కాపీలను కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి (హైదరాబాద్)తో పాటు సంబంధిత అన్ని శాఖల అధికారులకు తదుపరి చర్యల నిమిత్తం పంపారు.
