కర్నూలులో పోలీసుల మెరుపు తనిఖీలు

కర్నూలులో పోలీసుల మెరుపు తనిఖీలు
కర్నూలు, ఆంధ్రప్రభ:
కర్నూలు నగరంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నిర్మూలన ధ్యేయంగా పోలీసులు సరికొత్త వ్యూహంతో రంగంలోకి దిగారు. గంజాయి సేవించే వారిని శాస్త్రీయంగా పట్టుకునేందుకు జిల్లా పోలీస్ శాఖ అందుబాటులోకి తెచ్చిన ఆధునిక “డ్రగ్ డిటెక్షన్ కిట్స్” ద్వారా ఆదివారం సాయంత్రం నగరంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జారీ చేసిన ప్రత్యేక ఆదేశాల మేరకు.. ఇన్‌చార్జ్ డీఎస్పీ ఉపేంద్రబాబు పర్యవేక్షణలో టూ టౌన్ సీఐ శ్రీధర్, ఎస్సైలు మరియు పోలీస్ సిబ్బంది ఈ సంయుక్త ఆపరేషన్‌లో పాల్గొన్నారు.
ఈ తనిఖీల్లో భాగంగా టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడం కాంపౌండ్, సంకల్ బాగ్ తదితర సమస్యాత్మక ప్రాంతాలను పోలీసులు జల్లెడ పట్టారు. అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులను అదుపులోకి తీసుకుని, సరికొత్త డ్రగ్ డిటెక్షన్ కిట్ల సహాయంతో అక్కడికక్కడే ప్రత్యేక డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలు సేవించారా లేదా అనేది ఈ కిట్ల ద్వారా తక్షణమే నిర్ధారణ అవుతుందని పోలీసులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల జీవితాలు ఎలా నాశనమవుతాయో యువతకు వివరించిన పోలీసులు.. మత్తు పదార్థాలకు బానిసలైతే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
సమాజానికి పట్టిన ఈ గంజాయి పీడను వదిలించడంలో ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరమని కర్నూలు పోలీసులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా గంజాయి విక్రయాలు సాగినా, లేదా మత్తు పదార్థాల వినియోగం వంటి అసాంఘిక కార్యకలాపాలు మీ దృష్టికి వచ్చినా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇవ్వదలచిన వారు అత్యవసర సేవల నంబర్లు అయిన డయల్ 100, డయల్ 112 లేదా ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కు కాల్ చేసి వివరాలు తెలియజేయవచ్చని, సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని పోలీసులు హామీ ఇచ్చారు.

