చౌటుప్పల్ పరిధిలో భారీగా గంజాయి పట్టివేత

చౌటుప్పల్ పరిధిలో భారీగా గంజాయి పట్టివేత

  • 437 కిలోల సరుకు స్వాధీనం
  • ఇద్దరు యూపీ నిందితుల అరెస్ట్

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మొత్తంలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు శనివారం రాత్రి పట్టుకున్నారు. ఈ సంయుక్త ఆపరేషన్‌లో సుమారు 437.500 కిలోల గంజాయితో పాటు రవాణాకు ఉపయోగించిన మహీంద్రా XUV వాహనాన్ని స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. ఆదివారం చౌటుప్పల్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి (SDPO) పి. మధుసూదన్ రెడ్డి చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ జి మన్మధ కుమార్ తో కలిసి ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ​

పంతంగి టోల్‌ప్లాజా వద్ద వ్యూహాత్మక తనిఖీలు
​విశ్వసనీయ సమాచారం మేరకు మల్కాజ్‌గిరి ఈగల్స్ ఫోర్స్ (RNPS), నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ బృందం, చౌటుప్పల్ పోలీసులు సంయుక్తంగా శనివారం (మే 16) రాత్రి ఒక ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. చౌటుప్పల్ పరిధిలోని పంతంగి టోల్‌ప్లాజా సమీపంలో గల నైల్ కంపెనీ ఎదురుగా, హైదరాబాద్ వైపు వెళ్లే జాతీయ రహదారి (NH-65)పై పోలీసులు వ్యూహాత్మకంగా తనిఖీలు చేపట్టారు. ​ఈ క్రమంలో అనుమానాస్పదంగా వచ్చిన TS07GM 4617 నెంబర్ ప్లేట్ గల మహీంద్రా XUV వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులను చూడగానే వాహనంలో ఉన్న నలుగురిలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే తప్పించుకొని పారిపోగా, మిగిలిన ఇద్దరు నిందితులను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.

​ఒడిస్సా – రాజమండ్రి – యూపీ నెట్‌వర్క్
​అదుపులోకి తీసుకున్న నిందితులను విచారించగా అంతరాష్ట్ర గంజాయి నెట్‌వర్క్ గుట్టు రట్టయింది. పట్టుబడిన నిందితులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారని, వారు ఒడిస్సా రాష్ట్రం నుండి గంజాయిని కొనుగోలు చేసి రవాణా చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. ఈ భారీ స్మగ్లింగ్ వెనుక ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి చెందిన రాకేశ్ అనే వ్యక్తి ప్రధాన సూత్రధారిగా (సప్లయర్) ఉన్నట్లు తేలింది. రాకేశ్ ద్వారా సేకరించిన గంజాయిని, నకిలీ నంబర్ ప్లేట్ అమర్చిన మహీంద్రా XUV వాహనంలో ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

​స్వాధీనం చేసుకున్న సొత్తు (సీజర్ వివరాలు):
​వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, అందులో రహస్యంగా దాచిన భారీ గంజాయి నిల్వలు లభ్యమయ్యాయి. ​మొత్తం గంజాయి: సుమారు 437.500 కిలోలు, ​5 కిలోల చొప్పున ఉన్న 83 ప్యాకెట్లు (సుమారు 421.160 కిలోలు), ​2 కిలోల చొప్పున ఉన్న 8 ప్యాకెట్లు (సుమారు 16 కిలోలు) ​రవాణాకు ఉపయోగించిన మహీంద్రా XUV వాహనం (నకిలీ నంబర్: TS07GM 4617)

​నిందితుల వివరాలు, ​అరెస్ట్ అయిన వారు:
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లా, లిపాడి గ్రామానికి చెందిన డ్రైవర్ పూర్తిచేసే ​సలీమ్ (34),
​అమన్ (22) లను అందులోకి తీసుకోగా అదే రాష్ట్రానికి చెందిన నిందితులు అమీరుద్దీన్,
​ఫిరోజ్ తో పాటు రాజమండ్రి కి చెందిన ప్రధాన నిందితుడు/సప్లయర్ రాకేష్ పరారీలో ఉండగా వారికోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

​పోలీస్ సిబ్బందికి అభినందనలు
​ప్రాణాలకు తెగించి, సమయస్ఫూర్తితో వ్యవహరించి ఈ భారీ గంజాయి ముఠాను పట్టుకున్న ఈగల్స్ ఫోర్స్, నార్కోటిక్స్ పీఎస్, చౌటుప్పల్ పోలీస్ బృందం సిఐ జి మన్మధకుమార్, సిఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐలు కె. యాదగిరి, డి. నర్సిరెడ్డి, బి. జీవన్ రెడ్డి, కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు అభినందించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని పోలీస్ అధికారులు హెచ్చరించారు.

Leave a Reply