అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

హత్య చేసి తోటలో పడేసినట్లు అనుమానం
గంపలగూడెం లో మిస్సింగ్ కేసు నమోదు

మధిర,గంపలగూడెం, ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లా మధిర మండలం కృష్ణాపురం సమీపంలోని ఒక వెంచర్ లోనే చెట్ల పొదల మధ్య శనివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో ఒక యువతి మృతదేహం లభ్యమైంది. దీంతో సంఘటన స్థలానికి రూరల్ ఎస్సై లక్ష్మి భార్గవి చేరుకొని వివరాలను సేకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం మేడూరు గ్రామానికి చెందిన గోపిశెట్టి కల్పన (28) గా గుర్తించారు. ఆమెకు రెండు సంవత్సరాల బాబు ఉన్నాడు. ఆమె మధిరలోని ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్నారు.

కల్పన నాలుగు సంవత్సరాల క్రితం మేడూరు గ్రామానికి చెందిన యువకుడ్ని ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది. కొద్ది నెలలుగా వారి మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో అదే గ్రామంలోని నాయనమ్మ దగ్గర విడిగా ఉంటూ మధిరలో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు మేడూరు నుండి మధిరకి డ్యూటీ కి వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి బయలుదేరిన కల్పన 11 గంటల అవుతున్న ఆఫీస్ కి రాకపోవడంతోపాటు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.దీంతో కుటుంబ సభ్యులు బంధువులు ఇళ్ళకు ఏమైనా వెళ్లిందా? అని ఆరా తీయగా ఆమె ఎవరింటికి వెళ్లలేదని తేలింది.

ఇదే క్రమంలో కల్పన తండ్రికి శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో ఒక వ్యక్తి ఫోన్ చేసి మీ కూతుర్ని నేను పెళ్లి చేసుకోవడానికి తీసుకొని వెళుతున్నట్లు చెప్పినట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఫోన్ కాల్ వచ్చిన వెంటనే కల్పన తండ్రి గంపలగూడెం పోలీసులు ఆశ్రయించి సెల్ తనకు వచ్చిన ఫోన్ నెంబర్ను ఇచ్చి మిస్సింగ్ కేసును పెట్టారు. కేసు నమోదు చేసిన గంపలగూడెం పోలీసులు మృతురాలు సెల్ ఫోన్ సిగ్నల్స్ ను పరిశీలించగా ఖమ్మం జిల్లా మధిర మండలం కృష్ణాపురం సమీపంలో ఉన్నట్లు తేలింది. దీంతో గంపలగూడెం పోలీసులు శుక్రవారం రాత్రి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా యువతి మృతదేహాన్ని కనుగొన్నారు.

ఈ విషయాన్ని మధిర రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి హుటా హుటిన వచ్చి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మృతదేహంపై గాయాలు ఉండటంతో ఆమెను హత్య చేసినట్లుగా అనుమానానికి తావిస్తోంది. అంతేకాకుండా ఆమె కేకలు వేయకుండా చున్నీని నోటిపై బిగించి హత్య చేసినట్లు అనుమానాలు ఉన్నాయి. అయితే ఆమెను భర్త హత్య చేశాడా? లేక ప్రేమికుడు హత్య చేశాడా? హత్యకి మరే ఇతర కారణాలు ఉన్నాయా అనేది పోలీసుల విచారణలో బయటపడే అవకాశాలు ఉన్నాయి.

Leave a Reply