బాలికపై లైంగికదాడి.. భగ్గుమన్న ప్రజా సంఘాలు

బాలికపై లైంగికదాడి.. భగ్గుమన్న ప్రజా సంఘాలు

సుందరయ్య నగర్ జంక్షన్ వద్ద నిరసన
– దిష్టిబొమ్మ దహనం చేస్తూ ఆగ్రహం వ్యక్తం

తిరుపతి క్రైమ్, ఆంధ్రప్రభ : బాలికపై లైంగిక దాడికి పాల్పడిన దుర్మార్గుడిని దారుణంగా శిక్షించాలని ఐద్వా, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. శనివారం సుందరయ్య నగర్ జంక్షన్ వద్ద కామాంధుడి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి జీఎస్టీ కార్యాలయంలో పనిచేస్తున్న రామ్మూర్తి అనే వ్యక్తి తన వదినకు చెందిన 16 ఏళ్ల మైనర్ బాలికను మాయమాటలు చెప్పి లొంగదీసుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడి, అనంతరం బాలికను కిడ్నాప్ చేసి పరారీలో ఉన్నాడని ఆరోపిస్తూ ఈ ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి సాయి లక్ష్మి, సీఐటీయూ శ్రామిక మహిళా కన్వీనర్ లక్ష్మి మాట్లాడుతూ.. కూతురితో సమానమైన మైనర్ బాలికను మోసం చేసి అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా అధికారులు సరైన స్పందన ఇవ్వడం లేదని విమర్శించారు. హైదరాబాద్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినప్పటికీ, ఇక్కడ కేసు నమోదు చేయడంలోనూ, నిందితున్ని అరెస్ట్ చేయడంలోనూ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బాధిత కుటుంబ సభ్యుల వేదనను పట్టించుకోకుండా “మీ ఊరికి వెళ్లండి… మేము చూసుకుంటాం” అనే విధంగా మాట్లాడటం బాధాకరమని పేర్కొన్నారు.

నిందితుడిని వెంటనే పట్టుకుని మైనర్ బాలికను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి కూడా నైతిక విలువలు పాటించకుండా వ్యవహరించిన నిందితుడిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని సంబంధిత అధికారులను కోరారు. అతనిపై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో తక్షణమే అరెస్ట్ చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ పూర్తి చేసి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు వందలాది నాగరాజు, సుబ్రహ్మణ్యం, జయచంద్ర, వేణు, బాలసుబ్రమణ్యం, కెఆర్ఎస్ మన్యం, బుజ్జి, సిద్దు, రాజు, ఎన్.డి. శ్రీను, ఐద్వా నగర ప్రధాన కార్యదర్శి జయంతి, సుజాతమ్మ, షకీలా, హేమలత, కోమలమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply