బడా భీమ్‌గల్ లో వెలుగు చూసిన జైన మాత

బడా భీమ్‌గల్ లో వెలుగు చూసిన జైన మాత
- తీర్థంకరుడు పార్శ్వనాథుని ధ్యానాసన శిల్పం,
- కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కంకణాల రాజేశ్వర్,రాష్ట్ర కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్,
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : కొత్త తెలంగాణ చరిత్ర బృందం రాష్ట్రవ్యాప్త క్షేత్రస్థాయి సందర్శన, పరిశోధనలో భాగంగా భీమ్‌గల్ మండలంలోని బడా భీమ్‌గల్ గ్రామంలో గల శ్రీ రాజ రాజేశ్వర్ స్వామి దేవాలయాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు కంకణాల రాజేశ్వర్ సందర్శించారు. రాజేశ్వరాలయ ప్రాంగణంలోని వేపచెట్టు క్రింద ఒక విగ్రహాన్ని కనుగొన్నారు. ప్రతిమ లక్షణాల్ని రాష్ట్ర కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలుపుతూ… 23వ జైన తీర్థంకరుడు పార్శ్వనాథుని ధ్యానాసన శిల్పం. తలపై ముగ్గొడుగులు (త్రిస్తరచ్ఛత్రం) ఉన్నాయి. తోరణం మీద మామిడి కాయలు అలంకరించ బడ్డాయి. ఇది కొత్త శైలి గల చాళుక్యుల కాలమునాటి శిల్పం అని అన్నారు.
కంకణాల రాజేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ జైన మతంలోని 24 మంది తీర్థంకరులలో 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. తీర్థంకరుడు అంటే వంతెన నిర్మించేవాడని అర్థం. పార్శ్వనాథుడు క్రీ.పూ. 8వ శతాబ్దం లో కాశీ (వారణాసి) నగరంలో ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజు అశ్వసేనుడు, రాణి వామదేవి దంపతులకు జన్మించాడు. తన 30వ ఏట లౌకిక సుఖాలను త్యజించి సన్యాసిగా మారాడు. తీవ్రమైన తపస్సు చేసి జ్ఞానోదయం పొందాడు. నిగ్రంథ అనే కొత్త మతాన్ని స్థాపించాడు.నిగ్రంథుడు అంటే ప్రాపంచిక బంధాల నుంచి బయటపడిన వాడని అర్థం. పార్శ్వ నాథుడు ప్రధానంగా అహింస (హింసకు పాల్పడకూడదు), సత్యం (ఎల్లప్పుడూ నిజం చెప్పడం), అస్తేయం (దొంగతనం చేయరాదు), అపరిగ్రహం (ఆస్తిపాస్తులను కలిగి ఉండరాదు) అనే ప్రధాన నాలుగు సూత్రాలను బోధించాడు. బీహార్ లోని సమ్మెద శిఖరం (ప్రస్తుతం మధుబన్ జార్ఖండ్) వద్ద మోక్షాన్ని పొందాడు.
జైనమత స్థాపకుడు మొదటి తీర్థంకరుడైన వృష భనాథుడు.కానీ విశేషంగా కృషి చేసి, జైన మతాన్ని విస్తృత ప్రచారం చేయడంలో చరిత్రలో, చరిత్రకారుల్లో పార్శ్వనాథుడే మొదటి జైనతీర్థంకరుడిగా చరిత్ర పుటలలో నిలిచాడు. జైనతీర్థంకరులలో చివరి 24వ తీర్థంకరుడు వర్తమాన మహావీరుడు.మహోన్నత చరిత్ర కలిగిన పార్శ్వనాథుని విగ్రహం ఉంది. కాబట్టి వారసత్వ సంపదను భద్రపరిచి, సంరక్షించాలి. తద్వారా భావితరాలకు చరిత్ర తెలుసుకునే అవకాశం ఉంటుంది అని కంకణాల రాజేశ్వర్ అన్నారు. సందర్శనలో చరిత్ర జిజ్ఞాసపరులు స్థానికుడు, తెలంగాణ జాగృతి నిజామాబాద్ జిల్లా కోశాధికారి కర్నాల ధీరజ్ బాబు,భీమ్‌గల్ సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడు తీగల రఘు, రాంగిరి ఆనంద్ పాల్గొన్నారు.
