ఉద్యమకారుల హామీల అమలకు కమిటీ ఏర్పాటు,

ఉద్యమకారుల హామీల అమలకు కమిటీ ఏర్పాటు,

సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఉద్యమకారులు

నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ జీవితాలను అంకితం చేసి, ఎన్నో కష్టనష్టాలు భరించిన ఉద్యమకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

నర్సంపేట పట్టణంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నందగిరి రజనీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వేలాది మంది ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ఆరుగురు సభ్యులతో ఏర్పాటైన కమిటీ ఎలాంటి జాప్యం లేకుండా నిజమైన ఉద్యమకారులను గుర్తించి వారికి ఇచ్చిన హామీలను త్వరితగతిన అమలు చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, న్యాయవాదులు, మహిళలు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడారని, అలాంటి ఉద్యమకారులకు ప్రభుత్వం భరోసాగా నిలవడం అభినందనీయమని అన్నారు. స్వాతంత్ర సమరయోధులకు దేశం గౌరవం ఇచ్చినట్లే తెలంగాణ ఉద్యమకారులకు కూడా ప్రభుత్వ పరంగా ప్రత్యేక గుర్తింపు, గౌరవ మర్యాదలు దక్కేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఉద్యమకారుల సమస్యలను సానుభూతితో పరిశీలిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావడం పట్ల వారు ధన్యవాదాలు తెలిపారు. ఉద్యమకారుల కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మరిన్ని సంక్షేమ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమకారుల పట్ల ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధి భవిష్యత్తులో వారికి మరింత భరోసా కలిగిస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమం నర్సంపేట పట్టణ అధ్యక్షులు మాదాసి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. సమావేశంలో ఉమ్మడి జిల్లా మహిళా చైర్మన్, రాష్ట్ర మహిళా కార్యదర్శి కందికట్ల జయ, ఉమ్మడి వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజీర్, అల్లి యాదగిరి, కొత్త సంపత్ రెడ్డి, బండి కొమురయ్య, పరకాల బిక్షపతి, మాదాసి యాకయ్య, కోరుకొండ యాకయ్య, గురజాల మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply