ధాన్యం కొనుగోళ్లపై నిఘా

ధాన్యం కొనుగోళ్లపై నిఘా
-రైస్ మిల్లర్లకు అధికారుల కీలక సూచనలు
కేసముద్రం, ఆంధ్రప్రభ:
ప్రభుత్వ ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఉత్తర్వుల ప్రకారం జిల్లాలో మక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు మరియు రవాణా ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. మక్కజొన్న కొనుగోళ్ల కోసం 25 కేంద్రాలకు ప్రత్యేక అధికారులను, వరి ధాన్యం తరలింపు పర్యవేక్షణకు క్షేత్రస్థాయిలో 18 మండలాలకు తహసీల్దారులను నియమించారు. గత రెండు మూడు రోజులుగా కలెక్టర్ సహా అధికారులందరూ క్షేత్రస్థాయిలో నిమగ్నమై, ధాన్యాన్ని గోదాములు మరియు రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ ఇతర శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ కొనుగోళ్లు సాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో, కేసముద్రం మండల పరిధిలోని రైస్ మిల్లర్లతో తహసీల్దార్ వివేక్ సమక్షంలో ఒక ముఖ్యమైన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి స్థానిక సీఐ సత్యనారాయణ, ఎస్సై క్రాంతి కిరణ్, ఆర్ఐ, జిపివోలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు రైస్ మిల్లర్లకు, రవాణాదారులకు పలు కీలక సూచనలు జారీ చేశారు.
మిల్లుకు ధాన్యంతో వచ్చిన లారీలు లేదా వాహనాలను ఎటువంటి ఆలస్యం చేయకుండా, ఏరోజు వచ్చిన వాహనాలను ఆరోజే అన్‌లోడ్ చేయాలి. అన్‌లోడింగ్ పూర్తయిన వెంటనే, సంబంధిత లారీ యొక్క అక్నాలెడ్జ్‌మెంట్‌ను ఆన్‌లైన్ OPMS (ఓపీఎంఎస్) పోర్టల్‌లో వెంటనే కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ధాన్యంలో షార్ట్ ఫాల్, రాంగ్ వెరైటీ ఎంట్రీ (ఆన్‌లైన్‌లో సన్న ధాన్యం అని నమోదు చేసి దొడ్డు ధాన్యం పంపడం), లేదా నాణ్యత లోపాలు ఉంటే వెంటనే సంబంధిత సొసైటీ సీఈవో, సెంటర్ ఇన్‌చార్జ్ లేదా తహసీల్దార్ దృష్టికి తీసుకురావాలి. ధాన్యంలో లోపాలు ఉన్నాయని రైస్ మిల్లర్లు నేరుగా రైతులతో చర్చించకూడదు. ఆయా సమస్యలపై కేవలం సీఈవో లేదా సెంటరింగ్ ఇన్‌చార్జ్‌తో మాత్రమే మాట్లాడాలి.కొనుగోలు, అన్‌లోడింగ్ ప్రక్రియ వేగవంతంగా సాగేందుకు మిల్లుల్లో ఎక్కువ మంది హమాలీ వర్కర్లను అందుబాటులో ఉంచుకోవాలి.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకుండా, తేమ శాతాన్ని పరిశీలించకుండా వాహనాల్లో లోడింగ్ చేసి మిల్లులకు పంపితే సహించేది లేదని అధికారులు హెచ్చరించారు. మిల్లు వద్ద క్వాలిటీ చెకింగ్‌లో ధాన్యం తిరస్కరణకు గురైతే, అందుకు కారణమైన సెంటర్ ఇన్‌చార్జిలపై కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
ధాన్యం లారీలు మిల్లుకు వచ్చిన తర్వాత డ్రైవర్లు వాహనాలను అక్కడే వదిలేసి వేరే ప్రాంతాలకు వెళ్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. డ్రైవర్లు అన్‌లోడింగ్ సమయంలో అందుబాటులో లేకపోవడం వల్ల మిగిలిన వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగి, అన్‌లోడింగ్ ప్రక్రియ ఆలస్యమవుతోంది. కాబట్టి డ్రైవర్లు తప్పనిసరిగా మిల్లు వద్దే ఉండి సిబ్బందికి సహకరించాలని అధికారులు ఆదేశించారు.
ప్రభుత్వ ధాన్యం కొనుగోలు, రవాణా ప్రక్రియ ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగేందుకు మిల్లర్లు, రవాణాదారులు అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించాలని తహసీల్దార్ వివేక్ కోరారు.
