భక్తి శ్రద్ధలతో సుదర్శన మహాయాగం

భక్తి శ్రద్ధలతో సుదర్శన మహాయాగం
- నీలం మధు కవిత దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు
- విశ్వక్సేన ఆరాధనను నిర్వహించిన పుణ్య దంపతులు
- నేత్రపర్వంగా లక్ష్మీనరసింహ స్వామికి అభిషేకం
సంగారెడ్డి ప్రతినిధి,ఆంధ్రప్రభ: కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఇన్‌చార్జి నీలం మధు కవిత దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇస్నాపూర్ మున్సిపాలిటీ చిట్కుల్‌లోని ఆయన నివాసంలో నిర్వహించిన సుదర్శన నరసింహ హవన మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా జరిగింది. లోక కల్యాణార్థం, ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధి కోసం చేపట్టిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం శుక్రవారం ఉదయం 10 గంటలకు వేద పండితుల మంత్రోచ్చారణలతో ఘనంగా ప్రారంభమైంది.
శాస్త్రోక్తంగా సాగిన ఈ మహోత్సవంలో భాగంగా తొలుత ఏ కార్యమైనా విఘ్నాలు లేకుండా సాగాలని కోరుతూ విశ్వక్సేన ఆరాధనను నిర్వహించారు. అనంతరం పూజా ద్రవ్యాలను, ప్రాంగణాన్ని పవిత్రం చేస్తూ పుణ్యాహవాచనం జరిపారు. ఈ వేడుకలో ప్రధాన ఘట్టమైన లక్ష్మీనరసింహ స్వామి వారి అభిషేకం నేత్రపర్వంగా సాగింది. పంచామృతాలు, పవిత్ర జలాలతో స్వామివారిని అభిషేకించిన వేద పండితులు, అనంతరం ప్రధాన కుంభారాధన నిర్వహించి దైవ శక్తిని కలశంలోకి ఆహ్వానించారు. కార్యక్రమ పరాకాష్టగా సుదర్శన నరసింహ మహా యాగాన్ని వైభవంగా తలపెట్టారు. హోమ గుండంలో హవిస్సులను సమర్పిస్తూ, లోకంలోని సకల పీడలు తొలగి శాంతి సౌఖ్యాలు వర్ధిల్లాలని ప్రత్యేక పూజలు చేశారు. తమ వివాహ వార్షికోత్సవం రోజున ఆధ్యాత్మిక మార్గంలో ఈ యాగం నిర్వహించిన నీలం మధు కవిత దంపతులను విచ్చేసిన అతిథులు, బంధుమిత్రులు అభినందించారు
