పుస్తక పఠనంతోనే విజ్ఞానం పెంపొందుతుంది

పుస్తక పఠనంతోనే విజ్ఞానం పెంపొందుతుంది

  • అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

​చౌటుప్పల్, ఆంధ్రప్రభ:
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలు (మే 11 నుండి 17 వరకు) చౌటుప్పల్‌లో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం చౌటుప్పల్ శాఖా గ్రంథాలయంలో ‘గ్రంథాలయ దినోత్సవం’, ‘పుస్తక ప్రదర్శన’ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ముఖ్య అతిథిగా హాజరై స్థానిక ఆర్డిఓ వి శేఖర్ రెడ్డి తో కలిసి పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు, నిరుద్యోగులు గ్రంథాలయాల్లోని పుస్తకాలను చదువుకుని తమ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కోరారు. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు లైబ్రరీలోని వనరులను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని సూచించారు.

అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం. సుధీర్ మాట్లాడుతూ.. గ్రంథాలయంలోని అమూల్యమైన పుస్తకాలను చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. చౌటుప్పల్ గ్రంథాలయంలో చదువుకుని ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ​బూత తరుణ్ కుమార్ (హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్), కనక ఐశ్వర్య (ఎస్ ఏ, గణితం), ​వై. సూర్య (కానిస్టేబుల్) లను అదనపు కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు, ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ నాయక్, వివిధ వార్డుల ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply