ఆటో బోల్తా పడి నూతన వరుడు దుర్మరణం

ఆటో బోల్తా పడి నూతన వరుడు దుర్మరణం
– కన్నీటిరోధనలో నవవధువు
నందవరం, ఆంధ్రప్రభ: ఆటో బోల్తా పడి నూతన వరుడు దుర్మరణం చెందడంతో నవవధువు కన్నీటిరోధన అందరినీ కలిచివేసింది. దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన బోయ మద్దిలేటికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు బోయ మద్దిలేటి రంగడు (22)కు గోనెగండ్ల గ్రామానికి చెందిన శ్రావణితో ఈ నెల 3వ తేదీన వివాహం జరిగింది.
వివాహం అనంతరం నూతన వరుడు, వధువు కుటుంబ సభ్యులు కలిపి మొత్తం 12 మంది (ఎనిమిది మంది పెద్దలు, నలుగురు పిల్లలు) గురువారం సాయంత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు.
శుక్రవారం ఉదయం తిరుగు ప్రయాణంలో నందవరం మండలం ముగతి సమీపంలో 167వ జాతీయ రహదారిపై వారు ప్రయాణిస్తున్న ఆటోకు కుక్కలు అడ్డుగా రావడంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నూతన వరుడు రంగడును ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. మిగతా కుటుంబ సభ్యులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మృతుడు కోడుమూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పని చేస్తున్నట్లు తెలిసింది.
నూరేళ్ల జీవితానికి ఎన్నో కలలు కట్టుకున్న నవదంపతులను ఈ రోడ్డు ప్రమాదం విడదీయడంతో ఆసుపత్రి ఆవరణలో కుటుంబ సభ్యుల రోదనలు హృదయవిదారకంగా మారాయి. బంధువులు, కుటుంబ సభ్యుల కన్నీటి పర్యంతంతో ప్రాంతం విషాదంలో మునిగిపోయింది.
ప్రమాద స్థలాన్ని ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి పరిశీలించారు. ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు నందవరం ఎస్‌ఐ తిమ్మారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
