పుట్టపర్తిలో అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్టు శంకుస్థాపన

పుట్టపర్తిలో అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్టు శంకుస్థాపన

పుట్టపర్తి, ఆంధ్రప్రభ: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో రక్షణ రంగ ప్రాజెక్టులు ఏర్పాటు కావడం శుభపరిణామమని పేర్కొన్నారు. పుట్టపర్తి ఒకప్పుడు శాంతికి చిహ్నంగా ఉన్న ప్రాంతమని, ఇప్పుడు దేశ రక్షణ రంగ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం గర్వకారణమని అన్నారు.

రాయలసీమ ప్రాంతం గతంలో వెనుకబడిన ప్రాంతంగా భావించబడేదని, ప్రస్తుతం పరిశ్రమలు, పెట్టుబడుల రాకతో వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన పేర్కొన్నారు. కియా, రాయల్ ఎన్‌ఫీల్డ్, డ్రోన్స్ తయారీ వంటి పరిశ్రమల వల్ల ప్రాంతం ఆర్థికంగా బలోపేతమవుతోందని చెప్పారు.

దేశానికి వచ్చే మొత్తం పెట్టుబడుల్లో సుమారు 25.3 శాతం ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నాయని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నాయకత్వం, విధానాలపై నమ్మకమే రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడానికి కారణమని అన్నారు.

డ్రోన్ శక్తి మిషన్ ద్వారా రాష్ట్రాన్ని డ్రోన్ హబ్‌గా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. కర్నూలు విమానాశ్రయంతో డ్రోన్ ప్రాజెక్టులను అనుసంధానిస్తామని చెప్పారు. అలాగే తిరుపతి నుంచి కువైట్ వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించడం ద్వారా వాణిజ్యం, పర్యాటక రంగాలకు ఊతం లభిస్తుందని తెలిపారు.

రాష్ట్రంలో విమాన ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందని, ఇది అభివృద్ధికి సూచిక అని మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

Leave a Reply