రైతు ముంగింట్లోకి శాస్త్రవేత్తలు

రైతు ముంగింట్లోకి శాస్త్రవేత్తలు
-వానాకాలం పంటలపై అవగాహన
-సన్న రకాలతోనే బోనస్
-వ్యవసాయ శాస్త్రవేత్త డా. ప్రభావతి
చౌటుప్పల్, ఆంధ్రప్రభ :
రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం, వ్యవసాయ శాఖ సమన్వయంతో సాగులో ఆధునిక మెలకువలను రైతులకు చేరువ చేస్తోంది. బుధవారం చౌటుప్పల్ మండల కేంద్రంలోని రైతువేదికలో మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు అధ్యక్షతన “రైతు ముంగింట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు రైతులకు సాగుపై కీలక సూచనలు చేశారు.
సన్న రకాలతోనే బోనస్ లబ్ధి- డా. ప్రభావతి
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డా. ప్రభావతి మాట్లాడుతూ.. వచ్చే వానాకాలం సీజన్‌లో రైతులు అధిక దిగుబడిని ఇచ్చే సన్న రకాలపై దృష్టి సారించాలని కోరారు.
సన్న రకాలలో ముఖ్యమైనవి : బీపీటీ 5204, ఆర్ ఎన్ ఆర్ 15048, కెఎన్ఎం 1638, డబ్ల్యూజిఎల్ 44 (సిద్ది), హెచ్ఎంటీ సోనా, జైశ్రీరామ్ వంటి రకాలను సాగు చేయడం ద్వారా ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలుకు మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ పొందవచ్చని సూచించారు.
ఎంటీయూ 1010, కెఎన్ఎం 118 వంటి దొడ్డు రకాలు సాగు చేస్తే గ్రేడ్-ఏ కింద మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. యూరియా వాడకాన్ని తగ్గించి నానో యూరియా వైపు మొగ్గు చూపాలని, ఎకరాకు రెండు బస్తాలకు మించి యూరియా వాడొద్దని స్పష్టం చేశారు.
వరిలో కాండం తొలిచే పురుగు (మొగిపురుగు) నివారణకు నాటు వేయడానికి వారం రోజుల ముందు నారుమడిలో ఒక సెంట్‌కు 2 కిలోల కార్బోఫురాన్ 3జి గుళికలు వేయాలని శాస్త్రవేత్తలు సూచించారు. నాటు వేసిన 15 రోజులకు పురుగుమందు పిచికారీ చేయాలని, దోమపోటు నివారణకు పొలంలో కాలిబాటలు తీయాలని రైతులకు అవగాహన కల్పించారు. మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య మాట్లాడుతూ ప్రతి రైతు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలని, ఫలితాల ఆధారంగానే ఎరువులు వాడి పెట్టుబడి తగ్గించుకోవాలని కోరారు.
సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ఒక ఎకరా వరికి వాడే నీటితో 3 ఎకరాల్లో ఆయిల్ పామ్, కూరగాయలు సాగు చేసి అధిక నికర ఆదాయం పొందవచ్చని సూచించారు. వైస్ చైర్మన్ అంజయ్య మాట్లాడుతూ శాస్త్రవేత్తల సలహాలు పాటిస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కొసనం రాకేష్ రెడ్డి, పొల్లేపల్లి లక్ష్మి, రెడ్డిబావి సర్పంచ్ నందగిరి వెంకట్, వ్యవసాయ విస్తరణ అధికారులు, మండల పరిధిలోని రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


