Vijay in2days | మొదటి దెబ్బ వైన్ షాపులపైనే..

Vijay in2days | మొదటి దెబ్బ వైన్ షాపులపైనే..
Vijay in2days | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజుల్లోనే విజయ్ తనదైన మార్క్ పాలనను చూపిస్తున్నారు. విజయ్ సంచలన నిర్ణయం తీసుకుంటూ ఆశ్చర్యపర్చుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన “డ్రగ్-ఫ్రీ తమిళనాడు” వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా విజయ్ అడుగులు వేస్తున్నారు. ఆయన మొదటి దెబ్బ వైన్ షాపులకే కొట్టాడు. కుర్చీలో కూర్చున్న మూడో రోజే మద్యం దుకాణాలపై ఉక్కుపాదం మోపాడు. రెండు వారాల్లో విద్యాసంస్థలు, ప్రార్థనా మందిరాల వద్ద మద్యం దుకాణాలను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ ఖాజానాకు ఎక్కువ ఆదాయం తెచ్చిపెట్టే వాటిల్లో మొదటిది లిక్కర్. వైన్ షాపులు పెరిగే కొద్దీ ఆదాయం పెరుగుతుంది. కాబట్టి లిక్కర్ బిజినెస్ ను ప్రభుత్వాలు కాపాడుతాయి. ఇందుకోసం తమిళనాడులో గత ప్రభుత్వం ఇష్టారీతిన మద్యం దుకాణాలను మంజూరు చేశారు. దీనిపై అప్పట్లో ప్రజల నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తన ఎన్నికల ప్రచారంలోనూ విజయ్ కు అనేక మంది ప్రజలు మద్యం దుకాణాలపై ఫిర్యాదు చేయడంతో ఆయన తక్షణమే నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అసౌకర్యంగా ఉన్న మద్యం దుకాణాలను తొలగించాలని తమిళనాడు విజయ్ ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలు, కళాశాలలు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ప్రధాన బస్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న మద్యం దుకాణాలన్నింటినీ వెంటనే మూసివేయాలని ఆదేశించారు. ఈ నిబంధన కింద రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 717 మద్యం దుకాణాలను గుర్తించి, వాటి లైసెన్స్‌లను రద్దు చేయడమో లేదా వాటిని అక్కడి నుంచి తరలించడమో చేయాలని స్పష్టం చేశారు.
శభాష్ సోదరా.. : కమల్‌హాసన్
మద్యం దుకాణాలపై సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయంపై సినీ నటుడు కమల్‌హాసన్ హర్షం వ్యక్తం చేశారు. ప్రార్థనా స్థలాలు, విద్యాసంస్థల సమీపంలో మద్యం దుకాణాలను తొలగించాలని తమిళ ప్రజలు ఎప్పటినుంచో కోరుకుంటున్నారన్నారు. సోదరుడు విజయ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు.
