ఈ-నామ్ మార్కెట్లలో రైతులకు లాభాల వర్షం…

ఈ-నామ్ మార్కెట్లలో రైతులకు లాభాల వర్షం…
కర్నూలులో వాముకు రికార్డు ధర.. ఆదోనిలో పత్తికి భారీ గిరాకీ
డిజిటల్ వేలాలతో రైతులకు పారదర్శక ధరలు
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు, ఆదోని ఈ-నామ్ వ్యవసాయ మార్కెట్లలో మంగళవారం నమోదైన ధరలు రైతుల్లో ఆశావహ వాతావరణాన్ని నెలకొల్పాయి. మసాలా పంటలు, నూనె గింజలు, పత్తి, పప్పుధాన్యాలకు మంచి గిరాకీ కనిపించడంతో రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కర్నూలు మార్కెట్‌లో వాము రికార్డు స్థాయిలో ధర పలకగా, ఆదోని మార్కెట్‌లో పత్తి క్వింటాకు రూ.10 వేల మార్క్ దాటడం చర్చనీయాంశమైంది.

కర్నూలు మార్కెట్‌లో వాము హవా..

కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఈ-నామ్ వేదికపై జరిగిన వ్యాపారంలో వాము (అజ్వైన్) పంటకు భారీ డిమాండ్ కనిపించింది. మొత్తం 93 లాట్లలో 604 సంచులు, 302 క్వింటాళ్ల వాము మార్కెట్‌కు రాగా, కనిష్ట ధర రూ.5,114, మోడల్ ధర రూ.15,588, గరిష్ట ధర రూ.18,899 నమోదైంది. దేశీయ మార్కెట్‌తో పాటు ఇతర రాష్ట్రాల వ్యాపారులు కూడా పోటీగా కొనుగోళ్లు జరపడంతో ఈ స్థాయి ధరలు నమోదైనట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.
మిర్చికి కొనసాగుతున్న మంచి ధర..
ఎండు మిర్చి రైతులకు కూడా మంగళవారం మార్కెట్ ఊరటనిచ్చింది. 21 లాట్లలో 107 సంచుల మిర్చి మార్కెట్‌కు రాగా, కనిష్ట ధర రూ.6,666, మోడల్ ధర రూ.16,709, గరిష్ట ధర రూ.19,399 నమోదైంది. నాణ్యమైన మిర్చికి వ్యాపారులు పోటీగా ధరలు కోట్ చేయడం గమనార్హం.
పప్పుధాన్యాలకు నిలకడైన మార్కెట్..
కందుల గింజలకు క్వింటాకు రూ.7,792 వరకు ధర లభించగా, మోడల్ ధర రూ.7,720గా నమోదైంది. మొత్తం 37 లాట్లలో 439 సంచులు, 220 క్వింటాళ్ల కందులు మార్కెట్‌కు వచ్చాయి. మినుములకు కూడా మంచి గిరాకీ కొనసాగింది. నాలుగు లాట్లలో వచ్చిన మినుములకు గరిష్టంగా రూ.7,862 ధర నమోదైంది. వేరుశెనగలకు రూ.7,469, ఆముదాలకు రూ.6,090, పొద్దుతిరుగుడు గింజలకు రూ.6,119 వరకు ధర లభించగా, శనగలకు రూ.5,310 ధర వచ్చింది. మొక్కజొన్న ధరలు మాత్రం పరిమిత స్థాయిలో కొనసాగాయి.
ఆదోనిలో పత్తికి భారీ ధర..
ఇక ఆదోని ఈ-నామ్ మార్కెట్‌లో పత్తి రైతులకు మంచి ఊరట లభించింది. 110 సంచుల్లో 436 క్వింటాళ్ల పత్తి మార్కెట్‌కు రాగా, కనిష్ట ధర రూ.4,389, మోడల్ ధర రూ.9,799, గరిష్ట ధర రూ.10,349 నమోదైంది. నాణ్యమైన పత్తికి వ్యాపారులు పోటీగా ధరలు పెట్టడంతో పత్తి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వేరుశెనగలకు కూడా ఆదోని మార్కెట్‌లో మంచి డిమాండ్ కొనసాగింది. 268 క్వింటాళ్ల వేరుశెనగలకు గరిష్టంగా రూ.7,936 ధర నమోదైంది. ఆముదం పంటకు రూ.6,132 వరకు ధర రావడం రైతులకు ఊరటనిచ్చింది. పూల విత్తనాలకు క్వింటాకు రూ.5,731 ధర నమోదైంది.3
ఈ-నామ్ వల్ల పెరిగిన పోటీ..
డిజిటల్ వేలం విధానం కారణంగా వివిధ ప్రాంతాల వ్యాపారులు ఆన్‌లైన్ ద్వారా వేలంలో పాల్గొనడం వల్ల పోటీ పెరిగిందని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. మధ్యవర్తుల ప్రభావం తగ్గడంతో రైతులకు నేరుగా మెరుగైన ధరలు అందుతున్నాయని పేర్కొన్నారు. వ్యవసాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం రైతులు తేమ శాతం తగ్గించి, శుభ్రపరిచిన నాణ్యమైన ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకువస్తే మరింత అధిక ధరలు పొందే అవకాశం ఉందని సూచిస్తున్నారు. నిల్వ సామర్థ్యం ఉన్న రైతులు మార్కెట్ ధోరణులను గమనిస్తూ సరైన సమయంలో విక్రయాలు చేపడితే లాభాలు మరింత పెరుగుతాయని అభిప్రాయపడుతున్నారు.
