జలధార – జలహారతి ద్వారా పాణ్యం చెరువుకు నూతన హంగులు..

జలధార – జలహారతి ద్వారా పాణ్యం చెరువుకు నూతన హంగులు..

చెరువు కట్ట వద్ద వాకింగ్ ట్రాక్, పార్కు, ఓపెన్ జిమ్ పనులకు భూమిపూజ..
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయ నీటి వనరుల పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. మంగళవారం జలధార – జలహారతి కార్యక్రమంలో భాగంగా పాణ్యం మండలంలోని పాణ్యం చెరువు కట్ట వద్ద చేపట్టనున్న అభివృద్ధి పనులకు పాణ్యం శాసన సభ్యురాలు గౌరు చరిత రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జలవనరుల సంరక్షణతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు సంప్రదాయ నీటి వనరుల పునరుద్ధరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.

పాణ్యం చెరువు కట్ట పరిసరాలను పర్యాటక, వినోద కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సుమారు రూ.48 లక్షల అంచనా వ్యయంతో వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, పార్కు, బెంచీలు, సోలార్ లైట్ల ఏర్పాటు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. జలధార – జలహారతి కార్యక్రమం ద్వారా చెరువుల అభివృద్ధితో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ జీవన ప్రమాణాల మెరుగుదల సాధ్యమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

పాణ్యం చెరువులో పేరుకుపోయిన పూడికను రైతులు స్వచ్ఛందంగా తమ వ్యవసాయ భూములకు తరలించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోందని కలెక్టర్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఉపాధి హామీ పథకం కింద రూ.4.5 లక్షల మేర సీడ్ అప్లికేషన్లు మంజూరయ్యాయని, అవసరమైతే మరిన్ని నిధులు కూడా మంజూరు చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. జలధార పథకంలో భాగంగా అమలు చేస్తున్న “చైన్ ఆఫ్ ట్యాంక్స్” విధానంలో పాణ్యం చెరువు 24వ క్యాస్కేడ్‌లోని మూడవ చెరువుగా గుర్తింపు పొందిందని తెలిపారు.

ఈ విధానం ద్వారా నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు భూగర్భ జలాల స్థాయి కూడా మెరుగుపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పశువుల సంరక్షణ కోసం రూ.10 లక్షల వ్యయంతో క్యాటిల్ హాస్టల్ నిర్మాణానికి స్థలం గుర్తించాలని డ్వామా పీడీని కలెక్టర్ ఆదేశించారు. చేపల పెంపకానికి ప్రోత్సాహకంగా రూ.10 లక్షల అంచనా వ్యయంతో ఫిష్ పాండ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. స్థానిక హైస్కూల్ చుట్టూ సుమారు 1.5 కిలోమీటర్ల మేర కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని రెండు విడతల్లో పూర్తి చేస్తామని కలెక్టర్ వెల్లడించారు.

విద్యార్థుల భద్రతతో పాటు పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ సూర్యనారాయణ, ప్రజాప్రతినిధులు, ఉపాధి హామీ సిబ్బంది, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply