జనగణన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలి…

జనగణన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలి…

ప్రజలు సరైన సమాచారం…
అందించి సహకరించాలి…
ఓర్వకల్లు మండలంలో జనగణన ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ డా. ఏ. సిరి…

కర్నూలు, ఆంధ్రప్రభ : జిల్లాలో జరుగుతున్న జనగణన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలు కూడా జనగణన సిబ్బందికి సహకరించి సరైన వివరాలు అందించాలని సూచించారు. మంగళవారం ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లె గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేటర్లు నిర్వహిస్తున్న జనగణన ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా వడ్డే సుబ్బమ్మ ఇంటికి వెళ్లిన కలెక్టర్, ఎన్యూమరేటర్ డిజిటల్ యాప్‌లో వివరాలు నమోదు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. జనగణనలో ఎలాంటి తప్పులు లేకుండా అప్రమత్తంగా పని చేయాలని ఎన్యూమరేటర్‌కు సూచించిన కలెక్టర్, యాప్‌లో ఏవైనా సాంకేతిక సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.

జనగణన ప్రక్రియను నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ, జనగణన ద్వారా ప్రభుత్వం అందించే సంక్షేమ ప్రయోజనాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు అందించే వ్యక్తిగత వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంటాయని, వాటిని దుర్వినియోగం చేయబోమని తెలిపారు.

అనంతరం వడ్డే సుబ్బమ్మ ఇంటి వ్యక్తిగత మరుగుదొడ్డి దెబ్బతిన్న విషయాన్ని గుర్తించిన కలెక్టర్, వెంటనే మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈకి ఆదేశించారు. అలాగే ఆమెతో మాట్లాడి పెన్షన్ సమయానికి అందుతోందా, రేషన్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయా అనే అంశాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఇంచార్జి కర్నూలు ఆర్డీఓ అనురాధ, ఓర్వకల్లు తహశీల్దార్ విద్యాసాగర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply