ఐపీఎల్లో క్యాపిటల్స్ సూపర్ విక్టరీ

ఐపీఎల్లో క్యాపిటల్స్ సూపర్ విక్టరీ
ధర్మశాల: ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతమైన విజయం సాధించింది. సోమవారం ధర్మశాల వేదికగా జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో ఢిల్లీ 3 వికెట్ల తేడాతో ఆతి పంజాబ్ కింగ్స్ను చిత్తుగా ఓడించి నాకౌట్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. క్యాపిటల్స్కు ఇది ఐదో విజయం కాగా.. పంజాబ్కు ఇది వరుసగా నాలుగో ఓటమి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (59), ఓపెనర్ ప్రియాంష్ ఆర్య (56) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అనంతరం 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
క్యాపిటల్స్ బ్యాటర్లలో కెప్టెన్ అక్షర్ పటేల్ (56), డేవిడ్ మిల్లర్ (51) వీరోచిత బ్యాటింగ్ తో ఢిల్లీకి చిరస్మరణీయ విజయం అందించారు. చెలరేగిన ఆర్య, అయ్యర్..అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్కు దూకుడైన ఆరంభం లభించింది. ఓపెనర్లు ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్ ధనాధన్ బ్యాటింగ్ తో ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఆర్య భారీ సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. దీంతో పంజాబ్ పవర్ ప్లేలో 72/0 భారీ స్కోరు సాధించింది. కానీ, తర్వాత తేరుకున్న ఢిల్లీ బౌలర్లు కుదురుగా ఆడుతున్న ప్రభ్సిమ్రాన్ సింగ్ (18)ను ఔట్ చేసి పంజాబ్కు తొలి షాక్ ఇచ్చారు.
తర్వాత దూకుడు కొనసాగించిన ప్రియాంష్ 24 బంతుల్లోనే ఒక ఫోర్, 6 భారీ సిక్స్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ, ఆ వెంటనే 56 స్కోరు వద్ద ఇతడు భారీ షాట్కు ప్రయత్నించి తివారి బౌలింగ్లో వెనుదిరిగాడు. దీంతో పంజాబ్ 97 స్కోరు వద్ద కీలకమైన ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కూపర్ కానోలి అద్భుతమైన బ్యాటింగ్ తో మళ్లీ కింగ్స్ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న వీరు సింగిల్స్, డబుల్స్తో స్కోరుబోర్డును ముందుకు సాగించారు. మొదట్లో కాస్త ఆచితూచి ఆడిన వీరిద్దరు తర్వాత జోరు పెంచారు.
ఈ క్రమంలోనే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్న శ్రేయస్ 34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో అర్ధ శతకం సాధించాడు. పంజాబ్ కూడా 15.1 ఓవర్లలో 150 పరుగుల మార్క్ను అందుకుంది. తర్వాత ధాటిగా ఆడుతున్న కానోలి (38; 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు) చివరికి తివారి బౌలింగ్లో ఔటవడంతో 83 పరుగుల కీలకమైన మూడో వికెట్ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. అనంతరం స్టోయినిస్ (1), శశాంక్ సింగ్ (0)లను వరుస బంతుల్లో స్టార్క్ పెవిలియన్కి పంపించి కింగ్స్కు భారీ షాక్లు ఇచ్చాడు. అయితే ఆఖర్లో శ్రేయస్ (59 నాటౌట్), సుర్యాంక్ (21 నాటౌట్; 8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు) బ్యాట్ ఝులిపించడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 210/5 స్కోరు చేసింది. ఢిల్లీ బౌలర్లలో స్టార్క్, మాధవ్ తివారి చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ముఖేష్ కుమార్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
