మిర్చి ఎగుమతులకు సహకారం కోరిన లోకేష్

మిర్చి ఎగుమతులకు సహకారం కోరిన లోకేష్
అమరావతి, ఆంధ్రప్రభ: సింగపూర్ -ఆంధ్రప్రదేశ్ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్ను ప్రారంభించాలని, మిర్చి ఎగుమతులకు సింగపూర్ కమాడిటీస్ ఇంటెలిజెన్స్ సెంటర్ ద్వారా సహకారమందించాలని సింగపూర్ కమాడిటీస్ ఇంటెలిజెన్స్ సెంటర్ (సీఐసీ) సీఈవో గ్లోరియాకు రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తిచేశారు. సింగపూర్ పర్యటనలో భాగంగా సోమవారం సీఐసీ సీఈవో గ్లోరియాతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ పలు వ్యాపార, వాణిజ్య అంశాలపై కూలంకషంగా మాట్లాడారు. సముద్ర ఉత్పత్తులు, వ్యవసాయం, ఖనిజాలు, ఫార్మాస్యూటికల్ రంగాల్లో వాణిజ్య అనుసంధానం, ఎంఎస్ఎంఈ ఎగుమతి దారుల చేరిక, కమాడిటీ ఇంటిలిజెన్స్ సమాచార మార్పిడి వంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – సీఐసీ మధ్య సహకారాన్ని కోరుతున్నామన్నారు.
సీఐసీ బ్లాక్‌చెయిన్ వేదికను ఉపయోగించి కాగితరహిత వాణిజ్య ప్రక్రియ, సరుకుల పారదర్శకతకు సింగపూర్, విశాఖపట్నం, కృష్ణపట్నం పోర్టు మధ్య ఓ డిజిటల్ వాణిజ్య కారిడార్ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని కోరారు. మిర్చితో పాటు ఏపీ నుంచి ఎగుమతికి అనువైన సరుకును గుర్తించేందుకు రాష్ట్రంలోని ఎగుమతిదారులు, సీఐసీ, ఎంటర్‌ప్రైజ్ సింగపూర్, ఎస్ఎక్స్‌ను ఒక చోట చేర్చి, ఏపీ – సింగపూర్ జాయింట్ కమాడిటీ ట్రేడ్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాలని సూచించారు.
సీఐసీ సహకరిస్తుంది: గ్లోరియా
ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధన ఆశయాలకు అనుగుణంగా ఉండే సుస్థిరత-అనుసంధానిత వాణిజ్య సాధనాలకు సీఐసీ సహకారం అందిస్తుందని ఆ సంస్థ సీఈఓ గ్లోరియా చెప్పారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ధృవీకరించిన కొనుగోలుదారులు, అమ్మకందారులు, లాజిస్టిక్స్ ప్రొవైడర్లు, ఫైనాన్షియర్లను అనుసంధానించే డిజిటల్ బీ2బీ మార్కెట్ ప్లేస్ కమాడిటీస్ ఇంటిలిజెన్స్ సెంటర్ (సీఐసీ) అని అన్నారు.
కమాడిటీ ఇంటెలిజెన్స్, ట్రేడ్ డేటా సెర్చ్ ఇంజిన్, దిగుమతి-డిమాండ్ అంచనా, ధర సిగ్నల్ పర్యవేక్షణ, బ్లాక్‌చెయిన్ ఆధారిత డాక్యుమెంట్ భద్రత, ఒకే క్లిక్‌తో కస్టమ్స్ క్లియరెన్స్, ఎండ్-టు-ఎండ్ ట్రేసబిలిటీ వంటి కార్యకలాపాలను సీఐసీ నిర్వహిస్తుందని తెలిపారు. సప్లై చైన్ ఫైనాన్స్, క్రెడిట్ అసెస్మెంట్, ఎంఎస్ఎంఈ ఎగుమతి దారుల వర్కింగ్ క్యాపిటల్ పరిమితులను సీఐసీ పరిష్కరిస్తుందని చెప్పారు.
ప్రవాసాంధ్రుల ఘన స్వాగతం
అంతకుముందు సింగపూర్ చేరుకున్న మంత్రి లోకేశ్‌కు అక్కడి ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ రాష్ట్రానికి తీసుకొచ్చినందుకు లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి మంత్రి లోకేశ్ మాట్లాడారు. మీరంతా రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి. మీరు పని చేస్తున్న కంపెనీల్లో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, వస్తున్న పెట్టుబడుల కోసం మాట్లాడాలన్నారు.
