పులి పిల్లలను దత్తత తీసుకున్న గవర్నర్

పులి పిల్లలను దత్తత తీసుకున్న గవర్నర్

హైదరాబాద్, ఆంధ్రప్రభ : భారతీయ సంస్కృతిలో వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక స్థానం ఉందని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ చీతా వంటి కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని తెలిపారు. భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ, తెలంగాణ అటవీ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో షేర్డ్ స్ట్రెప్స్ – షేర్డ్ ఫ్యూచర్, బిగ్ క్యాట్స్ సంరక్షణపై అంతర్జాతీయ వర్క్‌షాప్ సోమవారం నిర్వహించారు.

అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ పరిధిలో పెద్ద పులుల సంరక్షణకు సంబంధించి ప్రపంచ దేశాల మధ్య సహకారం పెంపొందించడంపై ఈ వేదికలో చర్చలు జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మాట్లాడుతూ పులులు, చిరుతలు, సింహాలు, చీతాల సంరక్షణలో భారత్ అనేక విజయాలను సాధించినట్టు తెలిపారు. ప్రపంచ వన్యప్రాణి సంరక్షణలో భారత్ నాయకత్వం భేష్‌గా ఉందన్నారు. అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అడవులు, వన్యప్రాణులు, జీవ వైవిధ్య పరిరక్షణకు కట్టుబడి ఉందన్నారు. అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వుల ప్రాధాన్యతను వివరించిన మంత్రి, గిరిజన సమాజాల పాత్రను కొనియాడారు.

థాయ్లాండ్, మలేషియా, రష్యా, అమెరికా ప్రతినిధులు మాట్లాడుతూ నిరంతర ఆవాసాల సంరక్షణ, శాస్త్రీయ పర్యవేక్షణ, వేట నిరోధక చర్యల వల్ల తమ దేశంలో పులుల సంఖ్య దాదాపు 100 నుంచి 200కు పెరిగిందన్నారు. పీసీసీఎఫ్‌లు వినయ్ కుమార్, డాక్టర్ సువర్ణ, రత్నాకర్ జౌహారీ, రీజినల్ పాస్‌పోర్టు ఆఫీసర్ స్నేహజ, అటవీ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సునీత ఎం భగవత్, సీసీఎఫ్ ప్రియాంక వర్గీస్, జూ డైరెక్టర్ సునీల్ హీరామత్, క్యూరేటర్ వసంత తదితరులు పాల్గొన్నారు.

పులి పిల్లలను దత్తత తీసుకున్న గవర్నర్..

నెహ్రూ జూలాజికల్ పార్క్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా రెండు పులి పిల్లలను దత్తత తీసుకున్నారు. 9 నెలల వయసు కలిగిన ఇషాన్ అనే మగ పులి పిల్లతో పాటు వన్యా అనే ఆడ పులి పిల్లను గవర్నర్ దత్తత తీసుకున్నారు. ఈ రెండు పులి పిల్లలు 2025 జూలై 30న జన్మించాయి. వీటి తల్లిదండ్రులు మాల, ప్రభాస్ అనే పులులు. ఈ రెండు పులి పిల్లలకు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఇటీవలే నామకరణం చేశారు. వన్యప్రాణుల సంరక్షణపై ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో గవర్నర్ ఈ దత్తత కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply