Magic Drains Andhra Pradesh | మురుగునీటి నిర్వహణలో కొత్త ప్రణాళిక

Magic Drains Andhra Pradesh | మురుగునీటి నిర్వహణలో కొత్త ప్రణాళిక

అమరావతి, ఆంధ్రప్రభ : గ్రామాలను పరిశుభ్రంగా మార్చేందుకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ దృష్టి సారించింది. ఇందుకోసం పంచాయతీరాజ్ శాఖ పలు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. దీనిపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు గతంలోనే దిశానిర్దేశం చేశారు. ఆ మేరకు గ్రామీణ అధికారులు సరికొత్త ప్రణాళికను సిద్ధం చేశారు.

మురుగునీటి సమస్య పరిష్కారానికి మ్యాజిక్ డ్రెయిన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో మ్యాజిక్ డ్రెయిన్ల ప్రణాళికకు అధికారులు రూపకల్పన చేస్తున్నారు. ఈ విధానంలో ఇళ్ల నుంచి వచ్చే మురుగునీటిని ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి పంపిస్తారు. మూడంచెల ఫిల్టర్ బెడ్ల ద్వారా నీటిని శుద్ధి చేస్తారు. ఈ నీరు పరిశుద్ధమైన భూగర్భ జలంగా మారుతుంది. తద్వారా బహిరంగ ప్రదేశాల్లో మురుగు నీరు నిల్వ ఉండటం కానీ, దుర్వాసన వంటి సమస్యలు పూర్తిగా పరిష్కారం కానున్నాయి.

ఈ నిర్మాణం ద్వారా మురుగునీటి నిర్వహణ ఖర్చులు కూడా భారీగా తగ్గుతాయని భావిస్తున్నారు. సాధారణ సిమెంట్ డ్రెయిన్ల నిర్మాణంతో పోలిస్తే మ్యాజిక్ డ్రెయిన్ల వల్ల సుమారు 80 శాతం ఖర్చు ఆదా అవుతుందని అధికారులు ప్రాథమిక అంచనాల్లో స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దీనివల్ల గ్రామీణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంతోపాటు పారిశుధ్యాన్ని మెరుగుపరచవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలకు ఆరోగ్యవంతమైన జీవనం అందించే అవకాశం ఏర్పడుతుంది.

80 శాతం డబ్బు ఆదా..

100 మీటర్ల రోడ్డుకు సాధారణ డ్రెయిన్ నిర్మించాలంటే రూ.4 లక్షలు ఖర్చవుతోంది. అదే మ్యాజిక్ డ్రెయిన్ అయితే రూ.లక్షలో పూర్తవుతుంది. ఈ విధంగా గ్రామాల్లో మ్యాజిక్ డ్రెయిన్లు ఏర్పాటు చేస్తే ఒక్కో రోడ్డుకు రూ.3 లక్షలకు పైగా ఆదా అవుతుంది. దుర్గంధం బాధ తప్పుతుంది. పంచాయతీలకు పారిశుద్ధ్య నిర్వహణ భారం తగ్గుతుంది. సీజన్‌కు ఒక్కసారి పైన వేసిన సిల్ట్ తొలగిస్తే చాలు.

కొన్నాళ్లు ఈ విధానం అమలు చేస్తే తక్కువ అడుగుల్లోనే నీటి లభ్యత ఉంటుంది. అంతేకాకుండా పనులు, శ్రామికులు ఉపాధి హామీ పథకం నుంచే కాబట్టి రాష్ట్ర ఖజానాకు కూడా భారం కాదు. అన్ని విధాలా మ్యాజిక్ డ్రెయిన్లు ప్రయోజనకరంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల ప్రయోగాత్మకంగా నిర్మించి, మంచి ఫలితాలు రాబట్టారు. ఇదే విధానాన్ని ఇకపై రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వానికి అధికారులు సిఫారసులు చేసినట్లు తెలుస్తోంది. మ్యాజిక్ డ్రెయిన్లు రాష్ట్రంలో మురుగునీటి వ్యవస్థ నిర్వహణలో విప్లవాత్మక మార్పు అవుతుందని భావిస్తున్నారు.

Leave a Reply