BJP Telangana | తెలంగాణపై బీజేపీ ఫోకస్

BJP Telangana | తెలంగాణపై బీజేపీ ఫోకస్

BJP Telangana | హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో మూడు దశాబ్దాలకు పైగా భారతీయ జనతా పార్టీకి అధికారం కలగానే మిగులుతోంది. స్వాతంత్ర్యోద్యమ ప్రభావంతో భారత జాతీయ కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు అధికారం చేపడుతున్నారే కానీ, బీజేపీ మాత్రం అధికారానికి ఆమడ దూరంలో ఉంటోంది.

దేశ ప్రధానిగా మూడు పర్యాయాలు పదవీ బాధ్యతలు చేపట్టిన మోడీ, అమిత్ షా నాయకత్వ పటిమతో ప్రస్తుతం క్రమేపీ ప్రజల్లో బలం పెంచుకుంటూ రాష్ట్రంలో సగం పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకునే స్థాయికి ఎదిగింది.

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రాదా.. ముఖ్యంగా హిందూత్వం ఎజెండాను తనలో నింపుకున్న భాజాపా తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశమే లేదా.. అనే చర్చోపచర్చలు రాజకీయ వర్గాల్లో అనేక ఏళ్లుగా కొనసాగుతున్నాయి. వాటన్నింటికీ చెక్ పెడుతూ, ఈ రాష్ట్రానికి ప్రత్యామ్నాయం మేమే అంటూ, కాదు.. కాదు.. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలోకి వచ్చేది మనమేనంటూ ఆ పార్టీ నాయకత్వం సరికొత్త పంథాను ఎంచుకుంది.

ఈ నేపథ్యంలోనే ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీని రాష్ట్రానికి ప్రత్యేకంగా రప్పించి, దాదాపు రూ.10 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించింది. కేంద్రం నిధులు ఇవ్వకుంటే.. రాష్ట్రాల అభివృద్ధి శూన్యం అంటూ తమ కేడర్‌కు అధికారానికి దారులు ఎలా వేయాలో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేలా అగ్రనేతలు ప్రసంగించిన తీరు ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన కాషాయం నాయకత్వంలో, శ్రేణుల్లో సరికొత్త జోష్ను నింపింది.

కేంద్రమే లేకుంటే జీతాలకు డబ్బుల్లేవ్..

రాష్ట్రాన్ని ఇప్పటి వరకూ పాలించిన పార్టీల నేతల తీరు వల్ల రాష్ట్రం అప్పులు కుప్పగా మారింది. అధికారం చెలాయించిన నేతలంతా నిలువెల్లా అవినీతిని నింపుకున్నారు. ఫలితంగా రాష్ట్రం అధోగతి పాలవుతోందంటూ బీజేపీ అగ్రనేతలు పరేడ్ గ్రౌండ్ సభలో కేడర్‌కు వివరించారు.

పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారానే అభివృద్ధి జరుగుతున్నట్టు వివరించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్స్ లేకుంటే.. గ్రామ పంచాయతీ సిబ్బందికి, మున్సిపాలిటీలలో సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి కూడా రాష్ట్రం వద్ద నిధులు లేవని స్పష్టం చేశారు.

గ్రామాలలో రహదారులు నిర్మించే రోజ్గార్ నిధుల నుంచి జాతీయ రహదారులు, రింగ్ రోడ్లు, ఇండస్ట్రియల్ పార్కులు, టెక్స్టైల్ పార్క్, రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో 42 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలను గత పదేళ్ల కాలంలోనే దాదాపు రూ.12 లక్షల కోట్ల వ్యయంతో నిర్వహించడమే కాకుండా, ప్రస్తుతం మరో రూ.10 వేల కోట్లతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోంది మనమేనంటూ కేడర్‌ను చైతన్యపర్చారు.

తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యమని చెప్పగానే కరతాళధ్వనులు సత్ఫలితాన్నిచ్చిన పరేడ్ మైదానంలోని సభగా మారింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే సన్నబియ్యం స్కీంలో కూడా 80 శాతం నిధులు కేంద్రమే భరిస్తున్నట్టు చెప్పారు.

మోడీ మంత్రమే కీలకం

కేంద్రంలో మూడు పర్యాయాలుగా అధికారంలో ఉంటున్న బీజేపీ క్రమేపీ అన్ని రాష్ట్రాల్లోనూ పాగా వేస్తోంది. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లోనూ అధికారం చేపట్టి రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ మా టార్గెట్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే అంటూ ఆ పార్టీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు.

అంతేకాకుండా, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సభకు ముందుగా జనాగ్రహ సభగా నామకరణం చేయగా, ప్రధాని మోడీ కార్యాలయం నుంచి అందిన సూచనలతో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా అంటూ బహిరంగ సభకు నామకరణం చేయడం విశేషం.

అంతేగాకుండా, అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండున్నరేళ్లు సమయం ఉండగానే అధికారం చేపట్టడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే గ్యారంటీగా మోడీ వల్లనే సాధ్యం అవుతోందంటూ ప్రజల్లోకి మోడీ గ్యారంటీ నినాదాన్ని తీసుకెళ్లేందుకు కేడర్ సిద్ధమైంది. జైశ్రీరాం – జై తెలంగాణ మా నినాదం అంటూ ప్రకటించడం విశేషం.

జైశ్రీరామ్ నినాదం ద్వారానే తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నట్టు ఆ పార్టీ నేతలు తమ శ్రేణులకు వివరించారు. ముఖ్యంగా నెక్స్ట్ తెలంగాణలో అధికారంలోకి రావడం పక్కా అంటూ ఏకంగా మోడీ ద్వారానే పార్టీ శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు చెప్పించడం అంటే బీజేపీ రానున్న ఎన్నికల పట్ల ఎంత క్లారిటీ ఉందో పరిణామాలు స్పష్టమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఆ పార్టీ నాయకత్వంలో, శ్రేణుల్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన మోడీ సభతో సరికొత్త జోష్ను నింపుకున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా, నిన్నటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్టుగా బీజేపీ శ్రేణులు మరింత ఉత్సాహాన్ని నింపుకున్నట్టుగా మోడీ సభ తేల్చినట్టుగా పలువురు భావిస్తున్నారు.

Leave a Reply