ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం

ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం

జోసెఫ్ విజయ్ అనే నేను.. చట్టబద్ధంగా ఏర్పడిన భారత రాజ్యాంగం పట్ల నమ్మకం, విశ్వాసం కలిగి ఉంటానని, భారత సార్వ భౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని ప్రమాణం చేస్తున్నాను. తమిళనాడు ముఖ్యమంత్రిగా నా విధులను నిజాయితీగా, మనస్సాక్షికి లోబడి నిర్వహిస్తానని, రాజ్యాంగానికి, చట్టానికి అనుగుణంగా… భయం లేదా పక్షపాతం లేకుండా, రాగద్వేషాలకు అతీతంగా ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.. ముఖ్యమంత్రిగా నా బాధ్యతల నిర్వహణలో భాగంగా నా దృష్టికి వచ్చిన ఏ విషయాన్నైనా, విధి నిర్వహణలో అవసరమైనప్పుడు తప్ప… ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎవరికీ వెల్లడించనని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.

  • తమిళనాడు సీఎం విజయ్

ఉప్పొంగిపోయిన తల్లిదండ్రులు
కార్య‌క్ర‌మానికి హాజ‌రైన రాహుల్ గాంధీ
ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచిన త్రిష‌
అభిమానులు, కార్య‌క‌ర్త‌ల‌తో కిట‌కిట‌లాడిన నెహ్రూ స్టేడియం
ప్ర‌మాణ స్వీకారం చేయించిన గ‌వ‌ర్న‌ర్ ఆర్లేక‌ర్‌

చెన్నై, ఆంధ్ర‌ప్ర‌భ : తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళ వెట్రి కజగం (ట‌వీకే) అధినేత జోసెఫ్ విజయ్ ఆదివారం ఉదయం 10 గంటలకు తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా నిలిచింది. విజయ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో గ‌వ‌ర్న‌ర్ రాజేంద్ర ఆర్లేక‌ర్ ప్ర‌మాణ స్వీకారం చేయించారు. కాగా, 2013లో అప్పటిప్రభుత్వం సినీ వేడుకల్లో ద‌ళ‌ప‌తి విజ‌య్‌ని చివరి వరుసలో కూర్చోబెట్టగా.. నేడు అదే స్టేడియంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణం చేయడాన్ని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

కార్య‌క్ర‌మానికి విజయ్ తల్లితండ్రులు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సహా పలువురు హాజరయ్యారు. టీవీకే కార్యకర్తలు, విజయ్ అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో నెహ్రూ ఇండోర్ స్టేడియంలో పండుగ వాతావరణం కనిపించింది. సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో నటి త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అంతకుముందు శనివారం సాయంత్రం విజయ్ తన మిత్రపక్షాల మద్దతు లేఖలతో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం విజయ్‌ను ముఖ్యమంత్రిగా నియమిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. మే 13లోగా అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ ఆయనకు సూచించారు.

చిన్న పార్టీల మద్దతు కూడగట్టిన టీవీకే..

తమిళనాడు ఎన్నికల ఫలితాలు మే 4న వెల్లడి కాగా.. 108 స్థానాలతో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ (118) లేకపోవడంతో విజయ్ కొంత ఇబ్బంది పడ్డారు. ఎంతలా ఉంటే తమకు ఛాన్స్ ఇవ్వాలంటూ నాలుగుసార్లు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌తో భేటీ అయ్యారు. మద్దతు ఉందని లేఖలు ఇచ్చినా కొన్ని ఫేక్ లెటర్స్ అంటూ ప్రకటనలు రావడంతో ప్రమాణ స్వీకారం వాయిదా పడుతూ వస్తోంది. చివరకు చిన్న పార్టీలతో జరిపిన చర్చలు ఫలించి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

కాంగ్రెస్ (5), సీపీఐ (2), సీపీఎం (2), వీసీకే (2), ఐయూఎంఎల్ (2) పార్టీలు విజయ్‌కు మద్దతు ప్రకటించాయి. దీంతో టీవీకే అధినేత విజయ్ బలం 120కి చేరింది. కాంగ్రెస్ మినహా మిగిలిన పార్టీలు బయటి నుండి మద్దతు ఇస్తూనే డీఎంకే కూటమిలో కొనసాగుతామని స్పష్టం చేశాయి. రాష్ట్రపతి పాలన రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే తాము మద్దతు ఇచ్చామని వీసీకే నేత తిరుమావళవన్ తెలిపారు. విజయ్‌తో పాటు కొందరు నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏడుగురు టీవీకే నేతలు ఉండగా, ఇద్దరు కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

ఏఎంఎంకే ఎమ్మెల్యే మద్దతుపై వివాదం..

ప్రభుత్వ ఏర్పాటు సమయంలో ఒక వివాదం కూడా తెరపైకి వచ్చింది. మన్నార్గుడి ఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజ్ తమకు మద్దతు ఇచ్చారని టీవీకే పేర్కొనగా, ఆ పార్టీ అధినేత టీటీవీ దినకరన్ దీన్ని తీవ్రంగా ఖండించారు. టీవీకే వారు నకిలీ లేఖను సృష్టించారని, సంతకాన్ని ఫోర్జరీ చేశారని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. కామరాజ్‌ను కిడ్నాప్ చేశారని ఆరోపించారు.

అయితే, కామరాజ్ స్వయంగా సంతకం చేస్తున్న వీడియోను టీవీకే విడుదల చేసింది. కానీ, కామరాజ్ మీడియా ముందుకు వచ్చి తాను ఎవరికీ మద్దతు లేఖ ఇవ్వలేదని స్పష్టం చేయడంతో ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది.

CLICK HERE TO READ MORE : Oath-taking | తమిళనాడు సీఎం విజయ్..

CLICK HERE TO READ MORE :

Leave a Reply