హత్య కేసు.. పదేళ్ల తర్వాత కోర్టు సంచలన తీర్పు

హత్య కేసు.. పదేళ్ల తర్వాత కోర్టు సంచలన తీర్పు
- నలుగురికి జీవిత ఖైదు
గరిడేపల్లి, ఆంధ్రప్రభ: మంత్రాల నెపంతో వ్యక్తిని కిరాతకంగా హత్య చేసిన కేసులో నలుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ హుజూర్‌నగర్ కోర్టు శుక్రవారం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఎస్సై చలిగంటి నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. పదేళ్ల క్రితం గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంలో జరిగిన ఈ దారుణ ఘటనపై న్యాయస్థానం తుది విచారణ పూర్తి చేసి ఈ శిక్షను ఖరారు చేసింది.
కేసు వివరాల్లోకి వెళితే..
పొనుగోడు గ్రామానికి చెందిన యెడిపాల వీరారెడ్డి, లింగారెడ్డి కుటుంబాల మధ్య గత కొంతకాలంగా భూ వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో లింగారెడ్డి కుమారుడు అనారోగ్యానికి గురికావడానికి వీరారెడ్డి చేస్తున్న మంత్రాలే కారణమని నిందితులు బలంగా నమ్మారు. ఈ కక్షతో 2015, జూలై 19న వీరారెడ్డిని దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని గన్ని బ్యాగులో కుక్కి, ఎవరికీ అనుమానం రాకుండా పొనుగోడు రిజర్వాయర్‌లో పడేశారు.
వీరారెడ్డి అదృశ్యంపై కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. నిందితులు యెడిపాల లింగారెడ్డి, సత్యనారాయణరెడ్డి, ఉపేందర్‌రెడ్డి, సైదిరెడ్డిలను అరెస్టు చేసి, వారి నుంచి హత్యకు వాడిన రెండు బైకులు, ఐరన్ రాడ్లు, హక్స్‌బ్లేడ్, పార వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుత గరిడేపల్లి ఎస్‌ఐ చలికంటి నరేశ్ నేతృత్వంలో పోలీసులు కోర్టుకు పక్కా సాక్ష్యాధారాలను సమర్పించారు.
ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి డాక్టర్ పి.శివరామ్ ప్రసాద్, నలుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. శిక్షతో పాటు ప్రతి నిందితుడికి రూ. 1,500 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో 45 రోజుల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, నేరం చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష తప్పదని ఈ తీర్పు ద్వారా మరోసారి రుజువైందని పోలీసులు పేర్కొన్నారు.
