“ఫైల్స్ కాదు… ఫలితాలు కదలాలి”
“ఫైల్స్ కాదు… ఫలితాలు కదలాలి”
క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే సుపరిపాలన సాధ్యం
కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు దిశానిర్దేశ
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : “ఆఫీస్ డేటా చెబుతుంది… కానీ ఫీల్డ్ నిజాన్ని చూపిస్తుంది. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజల సమస్యలను అర్థం చేసుకుని ఫలితాల ఆధారిత పాలన అందించాలి” అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయంలో కొనసాగుతున్న 7వ కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న సీఎం, రాష్ట్ర పాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమగ్ర సమీక్ష నిర్వహిస్తూ అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. “ఫైల్స్ కదలడం కాదు… ఫలితాలు కదలాలి. గవర్నెన్స్ వేగమే అభివృద్ధి వేగాన్ని నిర్ణయిస్తుంది” అంటూ అధికార వ్యవస్థ ప్రజలకు ప్రత్యక్ష ఫలితాలు అందించేలా పనిచేయాలని సీఎం సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో రాజీ లేదు ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదు వందశాతం పరిష్కారం కావాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు.

ముఖ్యంగా ఆర్థికేతర ఫిర్యాదులను అధికారులు పైకి కిందకు తిప్పకుండా తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఆర్థిక సంబంధిత ఫిర్యాదుల విషయంలో కూడా సమగ్ర విచారణ జరిపి అర్హులకు న్యాయం చేయాలని సూచించారు. 2027 మార్చి నాటికి రెవెన్యూ రికార్డులను పూర్తిగా ప్రక్షాళన చేసి “జీరో ఎర్రర్ రికార్డులు” రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అనవసరంగా ప్రైవేటు భూములను నిషేధిత జాబితాలో చేర్చడంతో ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానించారు.

“వెల్ఫేర్ – డెవలప్మెంట్ – వెల్త్ క్రియేషన్” ఒక చక్రం సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి పరస్పర అనుసంధానమై ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. “అభివృద్ధి లేకుండా సంపద లేదు… సంపద లేకుండా సంక్షేమం సాధ్యం కాదు” అని చెప్పారు. సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు భద్రత, భరోసా కల్పించామని, పీ4 విధానంతో రాష్ట్ర ఆర్థిక ప్రమాణాలను పెంచుతున్నామని వెల్లడించారు. 26 కొత్త పారిశ్రామిక విధానాలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌పై విశ్వాసం పెరిగిందన్నారు. రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు – 24 లక్షల ఉద్యోగాలు లక్ష్యం రాష్ట్రానికి ఇప్పటివరకు రూ.23 లక్షల కోట్ల మేర ఎంఓయూలు కుదిరాయని, అవి అమలైతే దాదాపు 24 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని సీఎం తెలిపారు.
గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా రంగాల్లో రాష్ట్రం ముందుకు సాగుతోందని చెప్పారు. డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం టెక్నాలజీలకు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారబోతుందని పేర్కొన్నారు. గూగుల్ ఆర్కే లర్ మిటాల్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని వెల్లడించారు. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి గూగుల్ వరకూ… ఏపీపై పెట్టుబడిదారుల దృష్టి “కాలేజీ రోజుల్లో రాయల్ ఎన్ఫీల్డ్ నడపడం గర్వంగా భావించేవాళ్లం. అలాంటి సంస్థను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువచ్చాం” అంటూ పరిశ్రమల అభివృద్ధిపై సీఎం వ్యాఖ్యానించారు.
వేసవిలో దేశ ప్రజలకు చల్లదనం అందించే ఏసీలను కూడా ఇకపై ఏపీ నుంచే సరఫరా చేసే స్థాయికి రాష్ట్రం చేరుకుందని చెప్పారు. ప్రజా సేవలో కొత్త ప్రమాణాలు అధికారులు మూడు రోజుల పాటు ఫీల్డ్‌లో ఉండేలా “సీయింగ్ ఈజ్ బిలీవింగ్” విధానాన్ని అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. కార్యదర్శులు, హెచ్వోడీలు, కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని సూచించారు. ప్రజల కోసం పనిచేసే అధికారులకు ఎలాంటి భయం అవసరం లేదని, పబ్లిక్ రిలేషన్స్ ఎంత ముఖ్యమో పబ్లిక్ డెలివరీ కూడా అంతే ముఖ్యమని అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సేవల వినియోగం పెరిగిందని, ప్రజలు ఆన్లైన్లో పన్నులు చెల్లించే స్థాయికి అవగాహన పెరిగిందని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ నుంచి మెగా డీఎస్సీ వరకూ… పథకాల అమలుపై వివరాలు కలెక్టర్ల సమావేశంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు, విజయాలను సీఎం విపులంగా వివరించారు. తల్లికి వందనం, స్త్రీశక్తి, అన్న క్యాంటీన్లు, అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ భరోసా, మత్స్యకార సేవలు, ఆటో డ్రైవర్ల సంక్షేమం, మెగా డీఎస్సీ, ఉచిత ఇసుక విధానం, పాఠశాలల అభివృద్ధి, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం, పోలవరం, వెలిగొండ, హంద్రీనీవా ప్రాజెక్టుల పురోగతి, గ్రీన్ ఎనర్జీ ఒప్పందాలు, ఐటీ, ఏఐ, డేటా సెంటర్ల స్థాపన వంటి అంశాలను ప్రస్తావించారు. ఏపీ దేశానికి బెంచ్‌మార్క్ కావాలి.
అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ పనితీరు దేశానికి ఆదర్శంగా నిలవాలని సీఎం ఆకాంక్షించారు. జిల్లాల మధ్య అభివృద్ధి పోటీ ఉండాలని, ఉత్తమ పద్ధతులను ఇతర జిల్లాల్లో కూడా అమలు చేస్తామని తెలిపారు. “సమస్య పరిష్కారం కోసం వినూత్నంగా ఆలోచిస్తేనే సుపరిపాలన సాధ్యమవుతుంది. డబ్బులు లేవని చెప్పడం కాదు… సంపద సృష్టించే దిశగా పని చేయాలి” అంటూ సీఎం అధికారులకు పిలుపునిచ్చారు.
