తల్లిదండ్రులు నేర్పిన క్రమశిక్షణే ప్రజా క్షేత్రంలో నిలబెట్టింది
తల్లిదండ్రులు నేర్పిన క్రమశిక్షణే ప్రజా క్షేత్రంలో నిలబెట్టింది
- కన్నవారు చూపిన సేవా మార్గంలో నడవాలి
- మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్
- అమ్మనాన్నల స్మృతిలో ప్రజా సేవలో ముందుకు
- చిట్కుల్‌లో ఘనంగా నీలం రాధ-నిర్మల్ వర్ధంతి
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : కన్నవారు చూపిన సేవా మార్గంలో నడుస్తూ, వారి జ్ఞాపకాలను ప్రజల గుండెల్లో సజీవంగా ఉండేలా సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆపత్కాలంలో ఒక్కరోజు వ్యవధిలో మరణించిన తన తల్లిదండ్రులు స్వర్గీయ నీలం రాధ, నిర్మల్ 5వ వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం చిట్కుల్ లోని ఆయన క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా నీలం మధు తన తల్లిదండ్రుల కాంస్య విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన తల్లిదండ్రులు నేర్పిన క్రమశిక్షణ, నలుగురికి సాయం చేయాలనే తపనే నేడు తనను ప్రజా క్షేత్రంలో నిలబెట్టాయని గుర్తు చేసుకున్నారు. పదవులు ఉన్నా లేకున్నా, సామాన్యుడి కష్టాల్లో తోడుండటమే తల్లిదండ్రులకు తాను ఇచ్చే నిజమైన నివాళి అని ఆయన స్పష్టం చేశారు.
తన తల్లిదండ్రుల స్మారకార్థం నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల స్థానిక ప్రజలు, నీలం అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడంలో నీలం మధు ముదిరాజ్ కుటుంబం ముందుంటుందని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో నీలం మధు కుటుంబ సభ్యులతోపాటు ఆయన అభిమానులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
