అభివృద్ధితో కూడిన సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యం…

అభివృద్ధితో కూడిన సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యం…
జి.కొండూరు మండలంలో రూ.32.60 కోట్లు సంక్షేమానికి చెల్లింపు…
చురుగ్గా జరుగుతున్న అభివృద్ధి పనులు…
- మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు…
జి కొండూరు, ఆంధ్రప్రభ : కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత జి.కొండూరు మండలంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు వివరించారు. జి.కొండూరు మండల తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ జి.కొండూరు మండలంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల నిమిత్తం మొత్తం రూ.32.60 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా కింద ప్రతినెలా సుమారు 8448 మంది లబ్ధిదారులకు రూ.3.61కోట్లు పింఛన్ల సొమ్ము చెల్లిస్తున్నట్లు వెల్లడించారు.
తల్లికి వందనం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక విద్యా పథకం ‘తల్లికి వందనం’ కింద 8,251 మందికి రూ.10.72 కోట్లు చెల్లించామన్నారు. అన్నదాత సుఖీభవ కింద సుమారు 8,702 మంది రైతులకు రూ.17.40 కోట్ల పెట్టుబడి సాయం అందించినట్లు తెలిపారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద 573 మందికి రూ.85.95 లక్షలు చెల్లించామన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి కింద సీఎంఆర్ఎఫ్ 343 మందికి రూ.1.94 కోట్లు, ఎల్.ఓ.సీల కింద 84 మందికి రూ.1.56 కోట్లు మంజూరు చేశామన్నారు. జి.కొండూరు మండలంలో సీఎంఆర్ఎఫ్ నుంచి మొత్తం 427 మందికి రూ.3.50 కోట్లు అందజేశామన్నారు.

అభివృద్ధి కార్యక్రమాలు…!
పల్లె పండుగ రెండు విడతలుగా సుమారు రూ.6.75 కోట్లతో 13.5 కిలోమీటర్ల పొడవునా గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించినట్లు తెలిపారు.వివి రోడ్డు కందులపాడు నుంచి గణపవరం అడ్డరోడ్డు వరకు 6.475 కిమీ పొడవునా బీటీ రోడ్డు అభివృద్ధికి రూ.3.90 కోట్లు మంజూరు కాగా టెండర్ల దశ పూర్తయిందని అతిత్వరలోనే పనులు ప్రారంభిస్తారన్నారు. గడ్డమణుగు నుంచి మునగపాడు వరకు రోడ్డు అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.

జి.కొండూరు-గంగినేని రోడ్డు తుదిదశలో ఉందన్నారు. కవులూరు-శాంతినగర్ రోడ్డు అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని అన్నారు. జి.కొండూరు నుండి చెవుటూరు రహదారి అభివృద్ధికి పరిపాలన అనుమతులు వచ్చాయన్నారు. హెచ్.ముత్యాలపాడు వద్ద బుడమేరుపై హైలెవల్ వంతెన నిర్మాణానికి సీఎం చంద్రబాబు కి ప్రతిపాదనలు అందజేసినట్లు తెలిపారు. దీనికి కూడా పాలనా అనుమతులు లభించినట్లు వెల్లడించారు. సున్నంపాడులో ఇండ్రస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అన్నారు. తారకరామ ఎత్తిపోతల పథకం పనులు కూడా పూర్తి చేస్తామని అన్నారు. ఇవి కాక ఇంకా చాలా అభివృద్ధి పనులు వివిధ దశలో ఉన్నాయని వెల్లడించారు.

