సుబ్రహ్మణ్యేశ్వరుడికి విశేష పూజలు నిర్వహించిన భక్తులు
కరిమాబాద్, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్ శివనగర్‌లోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో కొలువుతీరి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి భక్తులు మంగళవారం విశేష పూజలు నిర్వహించారు.
ఉదయం నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ ప్రాంగణంలో కార్యసిద్ధి విఘ్నేశ్వరుడు, శ్రీ లలితా దేవి, ఉమామహేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, బాలాంజనేయుడు, క్షేత్రపాలకుడిగా పంచముఖ ఆంజనేయుడు తదితర దేవతామూర్తులు కొలువుదీరినట్లు ఆలయ పూజారులు తెలిపారు.
ఈ దేవాలయానికి విచ్చేసిన భక్తులు నవదేవతామూర్తులను దర్శించుకుని పూజలు నిర్వహించడం ద్వారా దేవతల అనుగ్రహం పొందవచ్చని వారు పేర్కొన్నారు.
