నామమాత్రంగా మారిన పట్టు పరిశ్రమ, భూసార పరీక్ష కేంద్రాలు

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఉన్న పట్టు పరిశ్రమ పరిశోధన కేంద్రం, వ్యవసాయ శాఖ భూసార పరీక్ష కేంద్రం నామమాత్రంగా మారాయి. ఈ కేంద్రాల్లో ఎటువంటి పరిశోధనలు గానీ, భూసార పరీక్షలు గానీ నిర్వహించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల జరిగిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మరిపాల్ రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించారు. వాస్తవానికి ఈ కేంద్రాల్లో పట్టు పరిశ్రమకు సంబంధించిన పరిశోధనలు, భూసార పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా, ప్రస్తుతం అవి ఎప్పుడూ మూతపడే ఉంటున్నాయని తెలిపారు.

ఈ కేంద్రాలు రైతులకు ఎటువంటి ప్రయోజనం చేకూర్చడం లేదని స్థానిక రైతులు విమర్శిస్తున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి పట్టు పరిశ్రమ పరిశోధన కేంద్రం, భూసార పరీక్ష కేంద్రాలను తిరిగి సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.