5thMayeditorial | బీజేపీ చారిత్రాత్మక విజయం

5thMayeditorial | బీజేపీ చారిత్రాత్మక విజయం

5thMayeditorial | తమిళనాడులో విజయ్ రాజకీయ సంచలనం
కేరళలో యూడీఎఫ్ తిరిగి అధికారంలోకి
అసోంలో బీజేపీ హ్యాట్రిక్ సక్సెస్
పుదుచ్చేరిలో బీజేపీ కూటమి

5thMayeditorial | నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడగా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలనపై ప్రజల మద్దతు మరోసారి స్పష్టమైంది. ముఖ్యంగా, దశాబ్దాలుగా ఇతర పార్టీల ఆధిపత్యంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ 200కు పైగా సీట్లు సాధించడం చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. గత మూడు సార్లుగా అధికారంలో కొనసాగుతున్న తృణమూల్ కాంగ్రెస్‌ను అధికారంనుంచి దూరం చేయడం సాధారణ విషయం కాదు.

అలాగే, తమిళనాడులో 1967 నుంచి ద్రవిడ పార్టీలే అధికారంలో ఉండగా, రాజకీయాల్లో కొత్తగా అడుగుపెట్టిన సినీనటుడు విజయ్ తన పార్టీని స్థాపించిన కేవలం 14 నెలల్లోనే అధికారంలోకి రావడం మరో చారిత్రాత్మక పరిణామంగా మారింది. కేరళలో పదేళ్లుగా అధికారంలో ఉన్న మార్క్సిస్టు పార్టీ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ నుంచి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారం దక్కించుకోవడం కూడా విశేషం. కేరళలో సాధారణంగా ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములు ఐదేళ్లకు ఒకసారి మారుతూ అధికారంలోకి వస్తుంటాయి.

కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ప్రాంతీయ పార్టీ ఎన్ఆర్ కాంగ్రెస్‌తో కలిసి బీజేపీ కూటమి అధికారంలోకి రావడం గమనార్హం. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రారంభం నుంచే బీజేపీ ఆధిక్యంలో ఉందని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టేందుకు అవసరమైన సంఖ్యాబలం వైపు బీజేపీ క్రమంగా దూసుకెళ్లింది. గతంలో పెద్దగా బలం లేని బీజేపీ, ఈసారి రాష్ట్రంలో అధికారాన్ని సాధించడం విశేషంగా మారింది.

ఎన్నికల ప్రచారం సమయంలో బెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నందిగ్రామ్‌తో పాటు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ నియోజకవర్గాల్లో ఉత్కంఠభరిత పోటీ జరిగింది. ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ప్రారంభం నుంచే బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అసోంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించింది. ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ నేతృత్వంలో ఆ పార్టీ 126 స్థానాల్లో 74 స్థానాల్లో ఆధిక్యం సాధించింది.

తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే రెండో స్థానానికి, అన్నాడీఎంకే మూడో స్థానానికి పరిమితమయ్యాయి. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఓటమి చవిచూశారు. సినీనటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుని అధికారాన్ని చేపట్టింది.

కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) అధికారం దిశగా దూసుకెళ్తోంది. 140 స్థానాల అసెంబ్లీలో యూడీఎఫ్ వందకు చేరువగా సీట్లు సాధించే అవకాశం ఉంది. పదేళ్లుగా అధికారంలో ఉన్న పినరయ్ విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ఓటమి దిశగా సాగుతోంది. పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్ ఆధిక్యంలో నిలిచి, బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. మొత్తంగా, ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీకి 2014 సాధారణ ఎన్నికల విజయాలను గుర్తు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా పార్టీ తన ప్రభావాన్ని మరింత విస్తరించుకుంటోందని స్పష్టమవుతోంది.

Leave a Reply