తెలంగాణకు గర్వకారణం

తెలంగాణకు గర్వకారణం

న్యూఢిల్లీ–ఆంధ్రప్రభ ప్రతినిధి: అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో నిర్మించిన వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ టెక్స్టైల్ హబ్‌గా మారనుంది. అంతేకాకుండా ఈ పార్క్ దేశ వస్త్ర పరిశ్రమ రంగానికి మరింత ఊతమివ్వనుంది. తెలంగాణ రాష్ట్రానికి మన్నికగా నిలవనున్న ఈ పార్క్ వరంగల్ నగరానికి ప్రత్యేక గుర్తింపును తీసుకురానుంది. ఈ పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తెలంగాణ పర్యటనకు విచ్చేస్తున్నారు.

మోదీ హైదరాబాద్ నుంచి మే 10వ తేదీన వర్చువల్‌గా ఈ మెగా టెక్స్టైల్ పార్కును లాంచ్ చేయనున్నారు. ఈ మేరకు శనివారం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. రూ.1,695.54 కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా రూ.6 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. ఇప్పటికే రూ.3,800 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. 1,327 ఎకరాల్లో విస్తరించిన ఈ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ దేశంలోనే అతిపెద్దదిగా నిలవనుంది. ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అప్పారెల్ (PM MITRA) పథకం కింద బ్రౌన్‌ఫీల్డ్ ప్రాజెక్టుగా ఎంపికైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో నిర్మించిన ఈ పార్క్ ద్వారా వస్త్ర ఉత్పత్తి, ఎగుమతులు మరింతగా వృద్ధి చెందనున్నాయి. దీంతోపాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగనున్నాయి. ‘ఫామ్ టు ఫైబర్.. ఫైబర్ టు ఫ్యాక్టరీ.. ఫ్యాక్టరీ టు ఫ్యాషన్.. ఫ్యాషన్ టు ఫారిన్’ అనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5F విజన్‌ను ఈ మెగా టెక్స్టైల్ పార్క్ ప్రతిబింబించనుంది.

Leave a Reply