నోష్ ల్యాబ్ యాజమాన్యంపై చర్యలు
నోష్ ల్యాబ్ యాజమాన్యంపై చర్యలు
బాధిత కుటుంబానికి రూ.1.5 కోట్ల పరిహారం
చిట్యాల, ఆంధ్రప్రభ: చిట్యాల మండలం పిట్టంపల్లి పరిధిలోని నోష్ ల్యాబ్ ఫార్మా కంపెనీలో చోటుచేసుకున్న రియాక్టర్ పేలుడు ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుడు బాలకృష్ణ కుటుంబానికి ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అండగా నిలిచారు. యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలమవ్వడంతో, బాధిత కుటుంబానికి రూ.1.5 కోట్ల భారీ పరిహారం ప్రకటించారు.
నిన్న నోష్ ల్యాబ్ ఫార్మాలో రియాక్టర్ పేలి చిన్నకాపర్తి గ్రామానికి చెందిన బాలకృష్ణ అనే కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందారు. శనివారం ఉదయం బాలకృష్ణ భౌతికకాయాన్ని ఆయన స్వగ్రామమైన చిన్నకాపర్తికి తరలించారు. ఈ సందర్భంగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వేముల వీరేశం అధికారులతో కలిసి కంపెనీని సందర్శించారు. యాజమాన్యం తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట రూ.10 లక్షల కంటే ఎక్కువ ఇవ్వలేమని చేతులెత్తేసిన కంపెనీ ప్రతినిధులను ఎమ్మెల్యే గట్టిగా నిలదీశారు.
“భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ఘోరం జరిగింది. స్థానికులకు న్యాయం జరిగే వరకు, కుటుంబానికి భరోసా దక్కే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదు.” ఎమ్మెల్యే వేముల వీరేశం అనడంతో సుదీర్ఘ చర్చల అనంతరం యాజమాన్యం దిగివచ్చి డిమాండ్లకు అంగీకరించింది.
బాధిత కుటుంబానికి రూ.1.5 కోట్ల నగదు పరిహారం అందించింది. పరిశ్రమల్లో భద్రతా నిబంధనలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. కంపెనీలో స్థానికులకు ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
పరిహారం అందడం పట్ల బాధిత కుటుంబం ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపినప్పటికీ, మండలంలోని పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు జరగడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఫార్మా కంపెనీల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
