పనిమనిషి దొంగతనం బట్టబయలు
పనిమనిషి దొంగతనం బట్టబయలు
15 తులాల బంగారం, వెండి వస్తువుల రికవరీ.
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేక్ నగర్‌లో చోటుచేసుకున్న దొంగతనం కేసును పోలీసులు ఛేదించి, 15 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను రికవరీ చేశారు. ఈ ఘటనలో ఇంటి పనిమనిషినే నిందితురాలిగా గుర్తించి అరెస్ట్ చేశారు. సూర్య దేవాలయం సమీపంలోని వివేక్ నగర్‌లో నివసిస్తున్న కృష్ణమూర్తి నాగేంద్ర ఇంటిలో ఏప్రిల్ 21 నుండి 27 మధ్యకాలంలో సుమారు 15 తులాల బంగారం, 30 తులాల వెండి వస్తువులు కనిపించకుండా పోయాయి.
దీనిపై ఇంటికి తరచుగా వచ్చే పనిమనిషి లేదా కూరగాయలు తెచ్చే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు అందింది. ఈ మేరకు నాలుగో పట్టణ సీఐ విక్రమ్ సింహ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనుమానితులను విచారించిన అనంతరం, వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన పర్వీన్ అనే పనిమనిషి గత మూడు నెలలుగా ఆ ఇంటిలో పనిచేస్తూ దొంగతనానికి పాల్పడినట్లు తేలింది.

శనివారం నిందితురాలిని ఆమె నివాసం వద్ద అరెస్ట్ చేసి, విచారణ జరపగా ఆమె ఇంటిలో దాచిన 15 తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసు ఛేదనలో చురుకుగా వ్యవహరించి రికవరీకి సహకరించిన పీసీ మురళి, హెడ్ కానిస్టేబుల్ జీనస్, పీసీ సుబ్బారాయుడు, ఎస్సైలు గోపినాథ్, చంద్రశేఖర్‌లను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు.
