రబీ ధాన్యానికి గన్ని బ్యాగుల కొరత
రబీ ధాన్యానికి గన్ని బ్యాగుల కొరత
రైతులు ఇక్కట్లు
అధికారుల నిర్లక్ష్యంపై ఆవేదన
ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : రబీ సీజన్లో పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, వ్యవసాయ శాఖతో పాటు డీసీఎంఎస్ అధికారులు వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మండలంలోని ఎ.కొండూరు ఆర్ఎస్కే కేంద్రం వద్ద గన్ని బ్యాగుల కోసం రైతులు గంటల తరబడి ఎదురు చూస్తున్నారు.
ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ధాన్యం కొనుగోలు చేస్తున్నప్పటికీ, కొనుగోలు ప్రక్రియకు అవసరమైన గన్ని బ్యాగులను సకాలంలో అందించకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పొలాల్లో కష్టపడి పండించిన ధాన్యాన్ని కల్లాల్లో నిల్వ ఉంచిన రైతులు, ఎండల తీవ్రతతో ధాన్యం నాణ్యత దెబ్బతింటుందేమోనని భయపడుతున్నారు. మరోవైపు సాయంత్రం వేళ మబ్బులు కమ్ముకుంటే వర్షం పడుతుందేమోనని ఆందోళన చెందుతూ ధాన్యాన్ని కాపాడుకునేందుకు పరుగులు పెడుతున్నారు.
ఇప్పటికే కొనుగోలు చేసిన ధాన్యాన్ని కూడా మిల్లర్లు సకాలంలో దింపుకోకపోవడంతో నిల్వ సమస్య మరింత తీవ్రమైంది. దీంతో రైతులు ఇదేమి కర్మ బాబూ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గన్ని బ్యాగుల కొరత, రవాణా ఆలస్యం, నిల్వ సమస్యలతో రైతులు నష్టపోతున్నారని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గన్ని బ్యాగులు సరఫరా చేయడంతో పాటు కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు తరలించేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని కౌలు రైతు సంఘం, రైతు సంఘం నాయకులు హెచ్చరిస్తున్నారు.
