ఉపాధి హామీ పనులు పరిశీలించిన సర్పంచ్ రమాదేవి
మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు మండలం మునుగోడు మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ ఈరోజు పరిశీలించారు. పనులు జరుగుతున్న ప్రాంతాలను సందర్శించి కూలీలతో మాట్లాడారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో కార్మికులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
తగినంత నీరు తాగడం,మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవడం,తల కప్పుకుని పనిచేయడం వంటి జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. కూలీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ శ్యామల, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.
