అగ్నిమాపక సిబ్బందికి సన్మానం..

అగ్నిమాపక సిబ్బందికి సన్మానం..

బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అభినందన సభ..
సాహసోపేత సేవలకు 12 మంది అధికారులకు, సిబ్బందికి సత్కారం..
సకాలంలో స్పందించి భారీ ప్రమాదాన్ని తప్పించిన ఫైర్ సిబ్బంది..

విజయవాడ, ఆంధ్రప్రభ : నగరంలోని సిటీ కోర్టు సముదాయంలో ఇటీవల చోటుచేసుకున్న లిఫ్ట్ ప్రమాద ఘటనలో అప్రమత్తంగా వ్యవహరించి పలువురు న్యాయవాదులు, పౌరుల ప్రాణాలను కాపాడిన అగ్నిమాపక శాఖ అధికారులను, సిబ్బందిని బెజవాడ బార్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. విధి నిర్వహణలో చూపిన చాకచక్యం, సమయస్ఫూర్తి, సేవా తత్పరతకు గుర్తింపుగా ఈ అభినందన కార్యక్రమం నిర్వహించారు. గత నెల ఏప్రిల్ 23న విజయవాడ సిటీ కోర్టు సముదాయంలోని లిఫ్ట్‌లో పలువురు న్యాయవాదులు, పౌరులు చిక్కుకుపోయి తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలానికి వేగంగా చేరుకుని అత్యంత నైపుణ్యంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి అందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

వారి సకాల స్పందనతో ఒక పెద్ద ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఈ సేవలను గుర్తిస్తూ బార్ అసోసియేషన్ హాల్‌లో ప్రత్యేక సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న 12 మంది అధికారులు, సిబ్బందికి శాలువాలు, జ్ఞాపికలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. సన్మానం పొందిన వారిలో ఎన్టీఆర్ జిల్లా విపత్తు స్పందన, అగ్నిమాపక అధికారి ఎ.వి. శంకరరావు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ జి.వి. రామారావు, లీడింగ్ ఫైర్‌మ్యాన్ ఎల్. నాగరాజు, డ్రైవర్ ఆపరేటర్లు బి.వి. సుబ్బారావు, ఎం. కోటయ్యతో పాటు పలువురు ఫైర్‌మ్యాన్లు ఉన్నారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రాణాపాయ పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలిచి ప్రాణాలను కాపాడటం అగ్నిమాపక శాఖ సేవా స్పూర్తికి నిదర్శనమని కొనియాడారు. అగ్నిమాపక సిబ్బంది చూపిన మానవీయ దృక్పథం, వృత్తి నైపుణ్యం న్యాయవాద సమాజానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, న్యాయవాదులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.