నాటుసారాయి స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని లక్ష్మీసాగర్ తండా శివారు అటవీ ప్రాంతంలో అక్రమంగా నాటుసారాయి తయారీ జరుగుతోందనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.

దాడిలో భాగంగా అటవీ ప్రాంతంలో తనిఖీలు చేపట్టగా, మొత్తం 28 ప్లాస్టిక్ డ్రమ్‌లు (ప్రతి ఒక్కటి సుమారు 100 లీటర్ల సామర్థ్యం)లో నానబెట్టిన బెల్లం పానకం నిల్వ ఉంచినట్లు గుర్తించారు. అదే ప్రదేశంలో అక్రమంగా నాటుసారాయి తయారీకి ఉపయోగిస్తున్న రెండు భట్టీలను కూడా గుర్తించారు. అదనంగా అక్కడే సుమారు 25 లీటర్ల నాటుసారాయి సిద్ధంగా ఉన్నట్లు గుర్తించారు.

దాడి సమయంలో నిందితుడు అధికారులను గమనించి అక్కడి నుంచి పరారయ్యాడు. విచారణలో నిందితుడు బుక్య గంగారాం (వయస్సు 35 సంవత్సరాలు), నర్సాపూర్ గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు నిర్మల్ ఎక్సైజ్ శాఖ సీఐ రంగస్వామి తెలిపారు.

ఈ దాడిలో ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ రంగస్వామి ఆధ్వర్యంలో ఎస్‌ఐ అభిషేక్, సిబ్బంది నర్సయ్య, ఉత్తమ్, గంగారాం, సురేష్ పాల్గొన్నారు. అక్రమ మద్యం తయారీ మరియు రవాణాపై ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు కొనసాగిస్తుందని, ప్రజలు ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించాలని ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ రంగస్వామి సూచించారు.

Leave a Reply